ఈ సంక్రాంతికి మెగా కాంపౌండ్ నుంచే ఇద్దరు హీరోలు ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారు. ఒకరు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అయితే, ఇంకొకరు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ ఇద్దరు అన్నదమ్ములూ సంక్రాంతి బరిలో తమ తమ సినిమాలతో నిలవనున్నారన్నది ఇప్పటిదాకా విన్పిస్తోన్న విషయం.
సంక్రాంతికే చరణ్ 'వినయ విధేయ రామ' రాబోతోంది. ఆ సంక్రాంతికే వరుణ్ నటిస్తోన్న 'ఎఫ్2' విడుదల కాబోతోంది. అయితే, ఈ రెండూ ఒకే తేదీన రాకపోవచ్చనీ, వరుణ్ ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడనీ తెలుస్తోంది. అన్నయ్య చరణ్‌తో పోటీకి తమ్ముడు వరుణ్ ఏమాత్రం సుముఖంగా లేడు. ఆ మాటకొస్తే, 'ఎఫ్2' దర్శక నిర్మాతలూ 'వినయ విధేయ రామ'తో పోటీ పడే అవకాశాలు తక్కువ. సో, మరీ వెనక్కి కాకుండా.. రెండు మూడు రోజులు గ్యాప్ వుండేలా 'ఎఫ్2' వెనక్కి వెళ్ళే అవకాశం వుందని సమాచారమ్.
'వినయ విధేయ రామ' ఫస్ట్ లుక్ నిన్ననే వచ్చింది. 'ఎఫ్2' ఫస్ట్ లుక్ కూడా దీపావళి కానుకగా మొన్ననే వచ్చింది. రెండు సినిమాల ప్రచారం కూడా సైమల్టేనియస్‌గా జరిగే అవకాశం వుంది. ఒకటి పక్కా మాస్ మూవీ అయితే, ఇంకోటి పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన సినిమా. స్టార్‌డమ్ పరంగా చూసుకుంటే, సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 'ఎఫ్2'లో నటించాడు గనుక.. ఆ సినిమాకి అది ఒక అదనపు అడ్వాంటేజ్. వరుణ్ - వెంకీ మల్టీస్టారర్‌గా దీన్ని అభివర్ణించొచ్చు.
సంక్రాంతి అంటే, తెలుగువారికి అతి పెద్ద పండుగ. సో, వరుసగా రెండు మూడు సినిమాలు ఒకట్రెండు రోజుల గ్యాప్‌లో వచ్చినా.. దేనికీ పెద్దగా సమస్య వుండకపోవచ్చు. ఇదిలా వుంటే, సంక్రాంతికే బాలయ్య 'ఎన్‌టిఆర్ కథానాయకుడు'తో రాబోతున్న సంగతి తెల్సిందే.