సినీ రంగంలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్‌గోపాల్ వర్మ, తన సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో తన ట్వీట్లతోనూ సంచలనం సృష్టిస్తుంటారు. ఒక్కోసారి ఈ ట్వీట్లు వివాదాస్పదమయినప్పటికీ వర్మ మనసెరిగినవారు వాటితో బాగా కనెక్ట్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా రామ్‌గోపాల్ వర్మ తమిళ రాజకీయాలపై ఆసక్తికరమైన ట్వీట్ చేయడం జరిగింది. జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పడాన్ని ప్రస్తావిస్తూ రామ్‌గోపాల్ వర్మ వేసిన ట్వీట్స్ ఇప్పుడున్న రాజకీయ పరిణామాల్ని కళ్ళకు కట్టినట్లు చూపించాయనే అభిప్రాయం వినవస్తోంది. జయలలిత ఆత్మ పన్నీర్ సెల్వంతో మాట్లాడితే, భూతవైద్యుడిలా ప్రధాని నరేంద్రమోడీ పనిచేస్తారా? అని వర్మ ప్రశ్నించారు. ఓ రాష్ట్రం భగ్గున మండిపోతోంటే దేశాధినేత అయిన ప్రధానమంత్రి స్పందించకపోవడం శోచనీయంగానే ఉంది. అదే భావం వర్మ మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించిందని చెప్పవచ్చు. ఇంకో వైపున జయలలిత మరణానంతరం శశికళ మీద ఓ సినిమా తీస్తానని వర్మ ప్రకటించారు. ఆ కథ మీద కూడా ఆయన వర్కవుట్ చేస్తున్నట్లుగా తెలియవస్తోంది. ఈ టైమ్‌లోనే తమిళ రాజకీయాలు ఇలా మారడం పట్ల వర్మ తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించినట్లున్నారు.