వర్మగారు మరో బాంబ్ పేల్చారు. కొత్త సంచలనానికి తెర లేపారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌ని అనౌన్స్ చేశారు. 'టైగర్ కేసీఆర్ - ది అగ్రెసివ్ గాంధీ' అనే ట్యాగ్ లైన్‌తో వర్మ ఈ బయోపిక్‌ని అనౌన్స్ చేశారు. అంతేకాదు, 'ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు..' అంటూ కేసీఆర్ స్టైల్‌లో ఓ వ్యాఖ్యను ట్విట్టర్‌లో వదిలారు.
ఈ ట్వీట్‌కి అర్ధమేంటో ఆయనకే తెలియాలి. కానీ ఇది చూసిన వర్మ అభిమానులు, అభిమానేతరులు వర్మ ఇంకోసారి ఏదో లొల్లికే తెర లేపబోతున్నారన్న మాట అని అర్ధం చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ఒకప్పుడు మాఫియా, రియలిస్టిక్, రొమాంటిక్.. లాంటి కాన్సెప్ట్‌లు పట్టుకుని సినిమాలు తీసే వర్మ ఇప్పుడు మొత్తం ఫోకస్ బయోపిక్స్ పైనే పెట్టినట్లు కనిపిస్తున్నాడు. మొన్న 'శశికళ' అంటూ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ వెంట పడ్డాడు. నిన్న 'కోబ్రా' అంటూ కరడుకట్టిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్రను సినిమాగా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో ఏకంగా తానే స్వయంగా యాక్టింగ్‌కి దిగేశాడు. ఇలా వరుసపెట్టి బయోపిక్స్ అనౌన్స్ చేసుకుంటూ పోతున్నాడు. వీటిలో ఎన్నింటిని తెరకెక్కిస్తాడో, ఎన్ని మరుగున పడిపోతాయో తెలీదు.
ఇప్పటికే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇటు తెలంగాణాలో విడుదలైంది. కానీ అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడీ తాజా బయోపిక్ 'టైగర్ కేసీఆర్' సంగతేంటో చూడాలిక.