నటీనటులు : మియా మాల్కోవ
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు : ఆర్.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్ శ్రేయాస్, ఈ.టి
షార్ట్ ఫిల్మ్ తీసినంత ఈజీగా సినిమా తీసేస్తాడు రాంగోపాల్ వర్మ. టెక్నికల్‌గా స్ట్రాంగ్ కాబట్టి అంత వేగం సాధ్యమైంది. ఎప్పుడు మొదలెట్టాడో, ఎప్పుడు పూర్తి చేశాడో తెలియనంతగా `క్లైమాక్స్` అనే ఓ సినిమా తీశాడు. ధ్యేయం.. ఆన్ లైన్ రిలీజే. ఇది సినిమా అని కూడా అనకూడదు. ఎందుకంటే.. పట్టుమని గంట నిడివి కూడా లేదు. టైటిల్స్ పక్కన పెడితే 50 నిమిషాల సినిమా. శ్రేయాస్ ఈటీ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. చూడాలనుకున్నవాళ్లు రూ.100 చెల్లించి ఈ సినిమా చూడొచ్చు. మరి... వర్మ తీసిన `క్లైమాక్స్` ఎలా వుంది? అసలు ఏముంది ఇందులో?
* కథ
ఇద్దరు ప్రేమికులు. సరదాగా షికారు కోసం ఎడారిలోకి వస్తారు. `ప్రమాదం` అని తెలిసినా - అక్కడే కొన్ని రోజులు గడుపుతారు. అయితే ఈలోగా వాళ్లకు వింత మనుషులు కనిపిస్తారు. విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. మరి వాటి నుంచి వాళ్లెలా బయట పడ్డారు? ఎడారిలో ఏం జరిగింది? అనేదే కథ.
* విశ్లేషణ
వర్మ ఎప్పుడూ కథమీద ఫోకస్ పెట్టడు. దాన్ని తెరకెక్కించే విధానంపైనే దృష్టి పెడతాడు. ఈసారి పోర్న్ స్టార్ మియా మాల్కోవాని రంగంలోకి దించి - ఓ జంట మధ్య రొమాన్స్ చూపించాలనుకున్నాడు. అదీ ఎడారిలో. వర్మకి హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఆ ప్రేమతో, ఈ రొమాన్స్ మధ్య దెయ్యాల్ని తీసుకొచ్చాడు. అచ్చం మనుషుల్లానేఉండే దెయ్యాలు, వాళ్ల నుంచి హీరో, హీరోయిన్లు తప్పించుకునే ప్రయత్నం, మధ్యమధ్యలో రొమాన్స్, నగ్న దృశ్యాలూ... టోటల్ గా ఇదీ.. `క్లైమాక్స్`.
కథ పరంగా వర్మ ఎప్పుడూ వీకే. ఎప్పుడో పురానా జమానా నాటి దెయ్యాల కాన్సెప్ట్ ఇది. కాకపోతే.. సెటప్ మొత్తాన్ని తీసుకెళ్లి ఎడారిలో ఉంచాడు. మియాని చూస్తే.. రొమాంటిక్ ఆలోచనలు రావు. ఆ దెయ్యాల్ని చూస్తే భయం పుట్టదు. ఎప్పుడు `క్లైమాక్స్` వస్తుందా?? అని ఎదురు చూడడం తప్ప. సంభాషణలన్నీ ఆంగ్లంలోనే (బహుశా.. పాన్ ఇండియా సినిమా అవుతుందని వర్మ భావించి ఉంటాడు). ఏ సందర్భంలోనూ ఉత్కంఠత కలిగించకుండా చాలా సాదా సీదాగా ఈ సినిమాని చుట్టేశాడు వర్మ.
ఈ బడ్జెట్, ఇంత సమయం ఓ యువ దర్శకుడి చేతికి ఇచ్చినా - ఇంతకంటే మంచి సినిమా తీస్తాడేమో..? లాక్ డౌన్ సమయంలో తీసిన సినిమా అని వర్మ చెబుతున్నా, దానికంటే ముందే తెరకెక్కించి, ఇప్పుడు వదిలాడేమో అని ఎవరికైనా అనిపిస్తే, అది వాళ్ల తప్పేమీ కాదు. మీయా మాల్కోవా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటే తప్ప.. క్లైమాక్స్ వైపు దృష్టి సారించకపోవడం శ్రేయస్కరం.
* నటీనటులు
మియా మాల్కోవా గ్లామర్ కూడా ఈ షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమాని కాపాడలేకపోయింది.ఈ పోర్న్ స్టార్... వయసు ముదిరినట్టు కొన్ని ఫ్రేముల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తను తప్ప ఇంకెవ్వరివీ నోటెడ్ ఫేసులు కావు. సాంకేతికంగానూ గొప్పగా ఏం లేదు.
*సాంకేతిక వర్గం
ఎడారిలో సహజమైన ప్రదేశాలలోనే చిత్రీకరణ సాగింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా పనితనం... ఇవేమీ గుర్తు పెట్టుకునే స్థాయిలో లేవు. చివర్లో మియా మాల్కోవా నడుం ఎత్తినప్పుడు సూర్యుడి షాట్..దగ్గర మాత్రం వర్మ స్టైల్ కనిపిస్తుంది.
* ప్లస్ పాయింట్స్
నిడివి
* మైనస్ పాయింట్స్
మిగిలినవన్నీ
* ఫైనల్ వర్డిక్ట్: ఎడారిలో దెయ్యాలాట.