రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా, దాన్ని వివాదాస్పదంగా మార్చితే ఎలా.? విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇది అత్యంత దారుణమైన ఘటన. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచమే చిగురుటాకులా వణుకుతోంది. ఈ సమయంలో పరిశ్రమ నుంచి ప్రమాదకర వాయువు విడుదలై పర్యవారణాన్ని విషతుల్యం చేయడం ఇంకా బాధాకరం. దీనిపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ, దేవుడ్ని టెర్రరిస్టులు, వైరస్ లతో పోల్చాడు. ఓ కోణంలో వర్మ ట్వీట్ తప్పుగానే అనిపించవచ్చుగానీ, నిర్దయగా ప్రజల ప్రాణాలు పోతుంటే, ఆ దేవుడు ఎందుకు ఆపడంలేదన్న ఆవేదన ప్రతి వ్యక్తిలోనూ కలగడం సహజమే.
అదే అభిప్రయాన్ని వర్మ మరింత మసాలా జోడించి, ట్వీట్ రూపంలో వదిలాడు. వర్మని విమర్శించేవాళ్ళంతా ఒక్కసారి ఆయన ట్వీట్ వెనుక బాధను అర్థం చేసుకుంటే.. వివాదాలకు తావుండదు. అయితే, పరిశ్రమ నుంచి గ్యాస్ లీక్ అవడం అనేది ముమ్మాటికీ మానవ తప్పిదమే. ఆ పరిశ్రమ నిర్లక్ష్యం కారణంగా విశాఖలో పర్యావరణం విషతుల్యంగా మారుతోంది కొంతవరకు. ఈ ప్రమాదం ఎంత తీవ్రమైనదో ముందు ముందు తెలుస్తుంది. ఇప్పటికైతే, వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మూగ జీవాలు పెద్దయెత్తున ప్రాణాలు కోల్పోవడం కూడా బాధాకరమే. 48 గంటల పాటు విషపు గాలి ప్రభావం వుండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ, దాని ప్రభావం ఏళ్ళ తరబడి వుండొచ్చని కూడా అంటున్నారు.
There are only 3 entities who kill men women and children without discrimination of religion, caste and nationality and they are TERRORISTS, VIRUSES and GOD
— Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2020