లాక్ డౌన్ వల్ల చిత్రసీమలోని పనులన్నీ స్థంభించిపోయాయి. థియేటర్లకు మూత పడ్డాయి. షూటింగులు ఆగిపోయాయి. కనీసం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరగడం లేదు. లాన్ డౌన్ పొడిగించినా, ప్రభుత్వాలు కొన్ని మినహాయింపులు ఇస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు కార్యక్రలాపాలకు శ్రీకారం చుట్టాయి.అలాంటి మినహాయింపులు చిత్రసీమకూ కావాలని పలువురు నిర్మాతలు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారు. డబ్బింగ్, రీ రికార్డింగ్, ఎడిటింగ్, మిక్సింగ్ లాంటి పనులకు అనుమతి ఇవ్వాలని తమ్మారెడ్డి భరద్వాజా ప్రభుత్వాన్ని కోరారు. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలుకొన్ని ఉన్నాయి.
ఇవన్నీ నిర్మాణానంతర కార్యకలాపాలు పూర్తి చేసుకుంటే విడుదలకు సిద్ధం అవ్వొచ్చు. రేపటి రోజున థియేటర్లకు అనుమతులు వస్తే.. అప్పుడు ఈ సినిమాల్ని వెంటనే విడుదల చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల కొంతమంది నిర్మాతలు తలసాని శ్రీనివాసయాదవ్‌ని కలిసి, మెమొరాండం సమర్పించారు. అందులో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలన్నది ప్రధాన అంశం. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.