సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'క్లైమాక్స్' విజయంతో ఉత్సాహంగా కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 'RRR' సౌండింగ్ కు దీటుగా ఉండే 'NNN' త్వరలో ఆర్జీవీవరల్డ్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే కాకుండా 'ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ' అనే టైటిల్ తో నాథూరాం గాడ్సే వెర్షన్ చూపించేలా కనిపిస్తున్నా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా మొదలుపెట్టడం విశేషం. తాజాగా గాంధీ, గాడ్సే చిత్రాలను ఒకటిగా చేసిన ఫోటో ఉన్న పోస్టర్ ను విడుదల చేసి "గాంధీని చంపడం అంటే గాడ్సే తనను తాను చంపుకోవడం అనేది ఈ రెండు ఫొటోలను ఇలా ఒకటిగా చేయడం వెనుక వున్న ఐడియా!" అంటూ ట్వీట్ చేశారు. ఈ అంశంపై సినిమా చేయడం అంటే వివాదాల తేనెతుట్టెను కదపడమే అని ఇప్పటికే కామెంట్లు వినిపిస్తున్నాయి. అసలే వివాదాలతో చలికాచుకుంటూ వాటితోనే లక్షల రూపాయల విలువగల ప్రచారం సాధిస్తున్న ఆర్జీవీకి ఈసారి నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ అయ్యే సబ్జెక్ట్ దొరికిందని అంటున్నారు.
గతంలో అయితే ఈ వివాదాల సినిమాలకు సెన్సారింగు గట్రా సమస్యలు ఉండేవి.. ఇప్పుడు అలాంటివేమీ లేకుండా ఆర్జీవీ వరల్డ్ లో సాఫీగా విడుదల చేసుకోవచ్చు ఆర్జీవీ క్రియేటివిటీని అడ్డుకునే శక్తులు లేవు. మరి గురుడు ఏం చేస్తాడో చూడాలి.