ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'RRR'. మిగతా సినిమాలకు దీనికి తేడా ఏంటంటే ఒక్కరోజు ఆలస్యం అయినా నష్టం ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి మీద వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి. అందుకే వీలైనంతవరకూ రిలీజ్ డెడ్లైన్ మిస్ చేసుకోకూడదని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎంత ప్రయత్నించినా సినిమాకు వాయిదాలు మాత్రం తప్పడం లేదు.
గత రెండున్నర నెలలుగా అన్నీ షూటింగులు ఆగిపోయాయి. 'RRR' షూటింగ్ కూడా ఆగింది. అయితే షూటింగులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కాబట్టి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఈనెలలోనే షూటింగ్ మొదలవుతుంది. కానీ ఒక విషయంలో మాత్రం జక్కన్న టీమ్ కు టెన్షన్ తప్పడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అలియా భట్ చరణ్ కు జోడీగా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే అలియా మాత్రం ఇప్పట్లో షూటింగులో పాల్గొనేందుకు ఆసక్తిగా లేదట.
ప్రస్తుతం ముంబైలో కోవిడ్-19 కేసులు భారీగా ఉన్నాయి. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం, తిరిగి వెళ్లడం అన్నీ రిస్కుతో కూడుకున్నవని అలియా భావిస్తోందట. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే షూటింగుల్లో పాల్గొంటానని అంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే మరోసారి 'RRR' షూటింగుకు డిలే తప్పదు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.