దర్శకులంతా కథల్లేక అల్లాడిపోతుంటే... రాంగోపాల్ వర్మ మాత్రం శూన్యంలోంచి సైతం కథలు పుట్టించేస్తుంటాడు. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా... తనకు ఓ కథా వస్తువు దొరికేస్తుంది. ఇక కరోనా లాంటి విపత్తులు సంభవించినప్పుడు కథలు రాయకుండా ఎలా ఉంటాడు? కరోనాపై ఆయన సినిమా తీయగల సమర్థుడే. వర్మ ఇంతవరకూ అలాంటి ప్రకటన ఎందుకు చేయలేదబ్బా? అంటూ వర్మ ఫ్యాన్స్ కొంతమంది దీర్ఘాలోచనలో పడిపోయారు కూడా.
అయితే... ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే... కరోనాపై వర్మ ఎప్పుడో కథ రాసేశాడు. పదేళ్ల క్రితమే.. ఇలాంటి వైరస్‌ని దృష్టిలో ఉంచుకుని వర్మ ఓ కథ రాసుకున్నాడట. ఈ విషయాన్ని వర్మ ప్రియ శిష్యుడు పూరి జగ్ననాథ్ చెప్పాడు. ``పదేళ్ల క్రితమే రాంగోపాల్ వర్మ కరోనా లాంటి వైరస్ వస్తే ప్రపంచం ఎలా ఉంటుందన్న విషయంపై ఓ కథ చెప్పారు. నాకు మాత్రం కరోనాపై కథ రాసే ఆలోచన లేదు`` అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు పూరి. అంటే ఇలాంటి విధ్వంసం గురించి వర్మ ఎప్పుడో ఆలోచించేశాడన్నమాట. మనందరికంటే వర్మ ఓ అడుగు ముందే ఉంటాడు కదా?