రాయలసీమ ఫ్యాక్షనిజంపై 'రక్తచరిత్ర', బెజవాడ ముఠా రాజకీయాలపై 'వంగవీటి' చిత్రాల్ని తీసిన రామ్‌గోపాల్ వర్మ, తమిళనాడు రాజకీయాలపై సంధించనున్న పొలిటికల్ అస్త్రం 'శశికళ' కోసం కంటెంట్ వెతుక్కోవాల్సిన పనిలేదు. ఎందుకంటే రోజుకోరకంగా మారుతున్న రసవత్తర రాజకీయాలకు రామ్‌గోపాల్ వర్మ తన మార్క్ 'పెప్'ని యాడ్ చేస్తే సరిపోతుంది. జయలలిత మరణానంతరం ఎవరూ ఊహించని విధంగా 'శశికళ' పేరుతో సినిమాని తీయనున్నట్లు అనౌన్స్ చేశారు వర్మ. ఆయన ఆలోచనలు ఎంత పకడ్బందీగా ఉంటాయో తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడెవరూ జయలలిత గురించి మాట్లాడుకోవడంలేదు. అందరూ శశికళ గురించే మాట్లాడుతున్నారు. ఆమె ఓడి గెలిచారు. జైలుకెళ్ళినా, అధికారం తన చేతుల్లో పెట్టుకున్నారు. ఆమెకు రాజకీయ వ్యూహాలు తెలియక ముఖ్యమంత్రి పదవి కోల్పోయారని అందరూ అనుకోగా, అందుకు భిన్నంగా ఆమె వ్యూహాత్మక రాజకీయాలు నడిపారు. ఆమె చేస్తున్నది తప్పా? ఒప్పా? అనే సంగతి అలా ఉంచితే శశికళ రాజకీయ వ్యూహ చతురత ఎవర్నయినా ఆశ్చర్యపరచకమానదు. శశికళలో ఈ ప్రత్యేకతను వర్మ ముందుగానే ఊహించి ఉంటారు. దాదాపుగా తమిళ రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. కాబట్టి వర్మ 'శశికళ' సినిమాని ప్రారంభించేయొచ్చు.