సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై పరోక్షంగా ఘాటైన విమర్శలు చేసిన నాగబాబు, ఆ తరువాత పెదవి విప్పలేదు. రామ్‌గోపాల్ వర్మ మాత్రం ట్విట్టర్ వేదికగా యుద్ధం కొనసాగిస్తున్నారు. చివరికి నాగబాబు తనయుడు వరుణ్‌కి కూడా వర్మ ట్విట్టర్ ద్వారా ఉచిత సలహాలు ప్రారంభించారు. వరుణ్‌కి వర్మ ఇస్తున్న ఈ సలహాలు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, ఇంకొంచెం వివాదాస్పదంగా ఉన్నాయి. వర్మ, నాగబాబుని ఉద్దేశించి ఎలాగైనా విమర్శించొచ్చుగానీ కుటుంబ తగాదాలు పెట్టేలా వ్యవహరించవద్దని కొందరు అనుకుంటున్నారు. అయితే, క్రియేటివ్ డైరెక్టర్ అయిన తనపై అంత దారుణంగా తిట్ల పరంపర కొనసాగించిన నాగబాబుకి తన తప్పు తెలిసొచ్చేలా చేయడానికే వర్మ ఇదంతా చేస్తున్నారని ఇంకొందరు భావించడం జరుగుతోంది. నాగబాబు స్పందించకుండా ఉంటే ఇంకొన్ని రోజులకు వర్మ ట్వీట్ల యుద్ధం ఆపేయొచ్చు. ఒకవేళ నాగబాబు స్పందిస్తే ఇంకా వివాదం ముదిరిపోతుంది. అయితే ఈ ఇద్దరి మధ్యా వివాదాన్ని చల్లార్చేందుకు కొందరు తెలుగు సినీ ప్రముఖులు సమాయత్తమవుతున్నారని సమాచారమ్. అది సినీ పరిశ్రమకి కూడా మంచిదే. తెలుగు సినీ పరిశ్రమలో అందరూ తెలుగు సినీ కళామతల్లి బిడ్డలే. కాబట్టి వివాదం త్వరలో సద్దుమణిగిపోవాలని సగటు తెలుగు సినీ ప్రేక్షకులు ఆశిస్తుండడం అభినందనీయమే కదా.