రామ్ - బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. 'ది వారియర్` తరవాత రామ్. `అకండ` తరవాత.... బోయపాటి చేయబోయే సినిమా ఇదే. ఆల్రెడీ ముహూర్తం కూడా జరుపుకొంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి.
ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.100 కోట్లని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అందులో హీరో, దర్శకుడి పారితోషికమే రూ.40 కోట్లని సమాచారం. రామ్, బోయపాటి చెరో 20 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నార్ట. అఖండ కి ముందు బోయపాటి పారితోషికం 15 కోట్లు. అఖండ హిట్ తో ఆయన స్థాయి 20 కోట్లకు చేరింది. వారియర్ ఫ్లాప్ అయినా రామ్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు. ఈ వంద కోట్ల సినిమాలో తన వాటాగా రూ.20 కోట్లు అందేసుకుంటున్నాడు. రామ్ కెరీర్‌లో ఇంత పారితోషికం అందుకోవడం ఇదే తొలిసారి. ఈ సినిమాకి కొంచెం ఎక్కువ కాల్షీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని, అందుకే రామ్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడని టాక్.
ఓవైపు నిర్మాతలంతా నిర్మాణ వ్యయం ఎలా తగ్గించాలా? అని మల్లగుల్లాలు పడుతోంటే, మరో వైపు హీరోలు, దర్శకులు ఇలా పారితోషికాలు పెంచేసుకొంటూ పోవడం విచిత్రమే.