మణిరత్నం ప్రభావం చాలా మంది దర్శకులపై వుంది. ముఖ్యంగా ఆయనలా అందమైన ప్రేమ కథలని తెరపై ఆవిష్కరించాలనేది చాలా మంది దర్శకులు తపన. ఇందులో హను రాఘవపూడి కూడా ఒకరు. తొలి సినిమా అందాల రాక్షసి సినిమాతోనే తనపై మణిరత్నం ప్రభావం ఘాడంగా వుందని ప్రకటించుకున్నారు హను. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో సీతారామం చేస్తున్నారు. ఇది అందమైన ప్రేమకథ. పాటలు, ట్రైలర్ చాలా ఆహ్లాదంగా వున్నాయి. ఈ కథని చేయడంలో కూడా మణిరత్నం స్ఫూర్తి కనిపిస్తుంది. మణిరత్నం రోజా, దళపతి, రావన్.. ఇంకొన్ని కథలు, సన్నివేశాల్లో రామాయణ మహాభారతాల ప్రేరణ కనిపిస్తుంది. ఇప్పుడు హను చేస్తున్న సీతరామంలో కూడా రామాయణం అడుగడుగునా కనిపిస్తుంది. మొదట రామ్, సీత అని పేర్లు రామాయణం గుర్తు చేశారు హను. రష్మిక చేస్తున్న అఫ్రిన్ పాత్రని హనుమంతుడితో పోల్చారు. ట్రైలర్ ఈవెంట్ లో ఇది యుద్ధకాండ, సుందరకాండ అనుకోవచ్చ ? అని అడిగితే ఓపెన్ గా చెప్పలేదు కానీ.. సారాంశం అదే అన్నట్టుగా వ్యాఖ్యానించారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో హను ఇస్తున్న స్టేట్మెంట్లుకి ప్రతిసారి రామాయణం రిఫరెన్స్ తీసుకుంటున్నారు. ఇది ''యుద్ధంతో రాసిన ప్రేమ' ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం ఇన్ విజిబుల్.
కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం వుంటుంది. ఒక ఉదారణగా చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవరూ సరిపోరు. రాముడు విష్ణుమూర్తి అవతారం. రాముడు లాంటి లక్షణాలతో మరొకరు పుట్టలేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం, సంఘర్షణ వుంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం సీతారామంలో వుంటుంది'' అని హను చెప్పడం.. ఈ కథ రామాయణం సారంశ మనడానికి బలం చేకూర్చుతుంది. ఆగస్ట్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.