ఈమధ్య మల్టీస్టారర్ సినిమా హవా మరీ ఎక్కువైంది. ఇదో సేఫ్ గేమ్ అన్నది సినీ జనాల నమ్మకం. హీరోలు కూడా `కథ నచ్చితే.. ఎంతమంది హీరోలున్నా సరే` అంటూ రొటీన్ పాటే పాడుతున్నారు. దర్శకులు కూడా అలాంటి కథలు రెడీ చేయడంలో బిజీగా ఉన్నారు. అయితే యంగ్ హీరో రామ్ మాత్రం మల్టీస్టారర్ కథలంటే జంకుతున్నాడు. `సోలో హీరోనే సో బెటరు` అనే పాట పాడుతున్నాడు. ఈ మధ్య ఓ మల్టీస్టారర్ కథ రామ్ దగ్గరకు వెళ్లింది.
కథ వినకుండానే... రామ్ `నో` చెప్పేశాడట. మల్టీస్టారర్ సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదంటూ.. నేరుగానే చెప్పేశాడట. దానికీ ఓ బలమైన కారణం ఉంది. రామ్ చేసిన `మసాలా` మల్టీస్టారర్ సినిమానే. అది దారుణంగా ఫ్లాప్ అయ్యింది. రామ్ కెరీర్‌లో అదో మైనస్. `రామ రామ కృష్ణ కృష్ణ` కూడా మల్టీస్టారర్ సబ్జెక్టే అనుకోవాలి. అదీ ఫెయిల్ అయ్యింది. అందుకే... మల్టీస్టారర్ వైపుకు వెళ్లడం లేదు.
రామ్ ఓకే అంటే... ఈపాటికి `బంగార్రాజు` సినిమా కూడా పట్టాలెక్కేసేది. నాగచైతన్య చేయాల్సిన పాత్ర రామ్ దగ్గరకు వెళ్లిందని, రామ్.. సున్నితంగా తిరస్కరించాడని టాక్. పైగా రామ్ దృష్టి ఇప్పుడు పూర్తిగా మాస్, యాక్షన్ కథలపై పడిపోయింది. మల్టీస్టారర్ అంటే దాదాపుగా ఫ్యామిలీ సబ్జెక్టులే వస్తున్నాయి. అందుకే రామ్ మనసు వాటిపైకి వెళ్లడం లేదు.