దేశం గర్వించదగిన గాయకుడు.. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. దాదాపు 50 వేల పాటలు పాడి, ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. బాలుకి అందిన నంది అవార్డులు, జాతీయ పురస్కారాలు అనేకం. పద్మవిభూషణ్ తో ప్రభుత్వం కూడా సత్కరించింది. ఇప్పుడు బాలుపై ఓ బయోపిక్ కూడా రాబోతోందని టాక్. బాలు జీవిత విశేషాలతో ఓ కథ రెడీ అయ్యిందని, అయితే దర్శక నిర్మాతలు బాలు కుటుంబ సభ్యుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం.
బాలు తెలుగువాడే కాదు. దేశం మొత్తం పాటలు పాడారు. అన్ని భాషల్లోనూ ఆయన అభిమానులు ఉన్నారు. బాలు బయోపిక్ తీస్తే.. అది కచ్చితంగా పాన్ ఇండియా సినిమానే అవుతుంది. కాబట్టి.. కమర్షియల్ గా వర్కవుట్ అవుతుంది. బాలు తనయుడు ఎస్.పి చరణ్ గాయకుడే కాదు, నిర్మాత కూడా. తండ్రిపై బయోపిక్ తీయాల్సివస్తే, ఆయననే తీస్తాడని ఓ ప్రచారం జరుగుతోంది. అదెంత వరకూ నిజమో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.