తెలుగు సినిమా తన పరిధిని పెంచుకుంటోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ నుంచి దూసుకొస్తున్నాయి. పెద్ద హీరోలే కాదు, ఓ మోస్తరు హీరోలు కూడా ఇప్పుడు తమ మార్కెట్ రేంజ్‌ని పెంచుకోవడానికి తహతహలాడుతున్నారు. ఈ లిస్ట్‌లో ఇస్మార్ట్ హీరో రావ్‌ు పోతినేని కూడా చేరిపోనున్నాడు. రావ్‌ు హీరోగా రూపొందిన పలు సినిమాలు హిందీలోకి డబ్ అయి, అక్కడా సూపర్ హిట్స్ అవుతున్నాయి. యూ ట్యూబ్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోపక్క, రామ్ పోతినేని.. తమిళ సినిమా మార్కెట్‌పై ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది.
త్వరలోనే ఓ స్ట్రెయిట్ సినిమాతో డైరెక్ట్‌గా తమిళ సినీ ప్రేక్షకుల్ని పలకరిస్తానంటున్నాడు. తమిళంలో మాట్లాడటం రామ్ పోతినేనికి పెద్ద కష్టమేమీ కాదు. చిన్నప్పుడు చెన్నయ్‌లోనే పెరిగాడు మరి. ఆ మాటకొస్తే, మన హీరోల్లో చాలామందికి చెన్నయ్‌తో లింకులున్నాయి. గతంలో పరిస్థితి ఎలా వున్నా, ఇప్పుడు మన హీరోలు సౌత్‌లోని అన్ని భాషల మీదా ఫోకస్ పెడుతున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘నోటా’ తదితర సినిమాలతో ఇతర భాషల ప్రేక్షకుల్ని గట్టిగానే పలకరించిన విషయం విదితమే. తమిళ హీరోలకి ఎలాగూ మాంఛి మార్కెట్ వుంది తెలుగులో కూడా. మన తెలుగు హీరోలకీ అక్కడ మార్కెట్ పెరిగితే అంతకన్నా కావాల్సిందేముంది.? ఇక, రామ్ విషయానికొస్తే ప్రస్తుతం ‘రెడ్’ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. కరోనా వైరస్ దెబ్బ తీయకపోయి వుంటే, ఈపాటికే ‘రెడ్’ ప్రేక్షకుల ముందుకొచ్చేది.