లాక్ డౌన్ సీజన్లో చాలా సినిమాలు ఆగిపోయాయి. మార్చి, ఏప్రిల్‌లో విడుదల కావల్సిన సినిమాలు సైతం.. నెలల తరబడి థియేటర్ల తీత కోసం ఎదురు చూశాయి. థియేటర్లు ఎంతకీ తెరవకపోవడంతో కొన్ని ఓటీటీలతో సర్దుకుపోయాయి. రామ్ `రెడ్` కి సైతం భారీ ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమాని 30 కోట్లకు కొనాలని కొన్ని ఓటీటీ సంస్థలు ప్రయత్నించాయి. థియేటర్లు తెరిచే ఊసు లేకపోవడంతో ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేస్తారనుకున్నారంతా.
కానీ రామ్.. ఓటీటీ బేరాలకు తలొగ్గలేదు. ఈ సినిమాని థియేటర్‌లోనే చూపించడానికి ఫిక్సయ్యాడు. దసరా సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ని చిత్రబృందం ఖరారు చేసింది. 2021 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. సంక్రాంతికి క్లాస్, మాస్ సినిమాలంటూ బేధం ఉండదు. సినిమా బాగుంటే చాలు వసూళ్ల వర్షం కురిపిస్తారు. అందుకే నిర్మాతలు సంక్రాంతికి టార్గెట్ చేస్తుంటారు. రామ్ దృష్టి కూడా ఇప్పుడు సంక్రాంతిపై పడినట్టైంది. అయితే ఈ సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఆ పోటీని `రెడ్` ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.