కిషోర్ తిరుమల సినిమాలనగానే.. హార్ట్‌ని బాగా టచ్ చేసేస్తాయి. చాలా లోతుగా వుంటాయి అతని సినిమాల్లోని సన్నివేశాలు, డైలాగులు. కానీ, ఈసారి పక్కా మాస్ మూవీని అటెంప్ట్ చేశాడీ దర్శకుడు. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా 'రెడ్' సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమాలో మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక, 'రెడ్' సినిమా ప్రోమోస్‌ని బట్టి చూస్తే, హీరో రామ్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు.
తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై ఇంకాస్త క్లారిటీ వచ్చేసింది. గతంలో గోపీచంద్ హీరోగా 'గౌతమ్ నందా' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెల్సిందే. ఆ 'గౌతమ్ నందా' పోలికలు కొంచెం కనిపిస్తున్నాయి ఈ 'రెడ్' సినిమాలో. ఇక, కళ్యాణ్‌రామ్ హీరోగా చాలాకాలం క్రిందట వచ్చిన 'హరేరామ్' సినిమా షేడ్స్ కాస్త ఎక్కువగా ఈ 'రెడ్' సినిమాలో కనిపిస్తున్నాయి. అయితే, ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అనీ, తెలుగు తెరపై ఇంతవరకు ఎవరూ చూడని కాన్సెప్ట్ అనీ చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో అందరికీ సూపర్బ్ షాక్ ఇచ్చిన రామ్, ఆ సినిమాతో సూపర్ బంపర్ హిట్ కొట్టిన విషయం విదితమే.
దానికి రెట్టింపు నమ్మకంతో వున్నాడు రామ్ ఈ 'రెడ్' సినిమాతో. ఓటీటీ నుంచి చాలా పెద్ద ఆఫర్స్ వచ్చినా, సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే రిలీజ్ చేయాలని హీరో రామ్ సహా దర్శక నిర్మాతలు పట్టుదలతో వున్నారంటే, సినిమాపై వాళ్ళకెంత నమ్మకం వుందో అర్థం చేసుకోవచ్చు.