రామానాయుడు ఎంతో ఇష్టపడి కట్టుకొన్న స్టూడియోలు రెండు. ఒకటి.. హైదరాబాద్ లో ఉంటే, ఇంకొకటి... విశాఖపట్నంలో ఉంది. విశాఖలో కూడా షూటింగులు విరివిగా జరగాలని, చిత్రసీమ ఆంధ్రాలో కూడా ఎదగాలన్న కంకల్పంతో అప్పటి ప్రభుత్వం భారీగా భూముల్ని రామానాయుడు స్టూడియో కోసం కేటాయించింది. అయితే ఇప్పుడు ఏపీలోని వైకాపా నాయకులు కొంతమంది.. ఈ స్టూడియోపై కన్నేసి హస్తగతం చేసుకొంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
రామానాయుడు స్టూడియోలో షూటింగులు సరిగా జరగడం లేదని, ఆ మాత్రం దానికి.. ప్రభుత్వ స్థలాన్ని స్టూడియో కోసం కేటాయించడంలో అర్థం లేదని ఏపీ మంత్రులు కొంతమంది జగన్ ముందుకు తీసుకెళ్లారు. జగన్ కూడా సానుకూలంగా స్పందించడంతో... రామానాయుడు స్టూడియోలోని కొంత భూమి.. మళ్లీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయిందని సమాచారం. మరోవైపు.. ఈ స్టూడియోని పూర్తిగా ప్రభుత్వానికే అప్పగించేశారన్న ప్రచారం జరుగుతోంది.
దీనిపై సురేష్ బాబు గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ స్పందించడం లేదు. అయితే... ఈ వ్యవహారాన్ని సురేష్ బాబు కోర్టుకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని, ఆయన కోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకోవాలని చూస్తున్నారని సమాచారం.