రమేష్ వర్మని దర్శకుడిగా నిలబెట్టిన సినిమా `రాక్షసుడు`. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో ఇదో మంచి హిట్ గా నిలిచిపోయింది. నిజానికి `రాక్షసన్`లాంటి సినిమాల్ని రీమేక్ చేయడం చాలా కష్టం. ఆ ఫీట్... ఈ `రాక్షసుడు` సాధించింది. ఇప్పుడు రాక్షసుడు 2కి రంగం సిద్ధం అవుతోంది. నిన్న (సోమవారం) రమేష్ వర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `రాక్షసుడు 2` వస్తోందని అధికారికంగా ప్రకటించారు. అయితే హీరో ఎవరన్నదీ ఖాయం చేయలేదు.
ఈసారి రాక్షసుడు 2 కోసం పెద్ద ప్రయత్నాలే చేస్తున్నాడు రమేష్ వర్మ. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీద్దామనుకుంటున్నాడు. అందుకే ఈ ప్రాజెక్టు కోసం పాన్ ఇండియా హీరోనే వెదికి పట్టుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. ఒకరిద్దరు హీరోలతో రమేష్ వర్మ టచ్ లో ఉన్నాడని టాక్. అందులో ఒకరు సుదీప్ అయితే.. మరొకరు అభిషేక్ బచ్చన్. ఈ ఇద్దరిలో ఒకర్నిఫైనల్ చేసిన వెంటనే.. ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కిస్తారని టాక్. ఇప్పటికే స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. అయితే రాక్షసుడు కీ రాక్షసుడు 2 కథకీ ఎలాంటి సంబంధం ఉండదు. ఇది పూర్తిగా వేరే కథ. అందుకే `ఇట్స్ నాట్ ఏ సీక్వెల్` అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. రాక్షసుడు ఫ్రాంచైజీని కొనసాగిస్తూ ఇలా కొత్త థ్రిల్లర్ కథలు చెప్పాలన్నది రమేష్ వర్మ ఉద్దేశ్యం కాబోసు.