రానా హీరోగా తెరకెక్కిన చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. రానా సీఎం పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాని తమిళంలోనూ విడుదల చేయనున్నారు. ఈ నెల 22న 'నాన్ అనైయిట్టల్' పేరుతో తమిళంలో విడుదల కానుంది ఈ సినిమా. ఈ సందర్భంగా రానా తన అనుభవాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. చెన్నైతో తనకు చిన్నప్పట్నుంచీ పరిచయమనీ, అందుకే ఈ సినిమా స్ట్రెయిట్ తమిళ సినిమాలానే అనిపిస్తోందనీ అన్నారాయన. అలాగే రానా హీరోగా తెరకెక్కిన 'ఘాజీ' సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలయ్యింది. రెండు చోట్లా మంచి విజయం అందుకుంది. తాను ఏ సినిమా చేసినా అన్ని భాషల్లోనూ విడుదల కావాలని కోరుకుంటాడు రానా. అందుకే 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తమిళంలో విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాలోని చాలా డైలాగ్స్ తమిళ రాజకీయ పరిస్థితులకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. అందుకే ఈ సినిమాకి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ దక్కే అవకాశాలు లేకపోలేదు. తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కేథరీన్ హీరోయిన్లుగా నటించారు. తెలుగు, తమిళంలో హిట్ అయిన 'ఘాజీ' సినిమాని త్వరలోనే హిందీలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.