విరాటపర్వం... ఎప్పుడో మొదలైన సినిమా ఇది. ఎప్పుడో పూర్తయ్యింది కూడా. కానీ ఇప్పటి వరకూ ఈ సినిమా అడ్రస్‌లేదు. కరోనా వల్ల సినిమా విడుదల లో జాప్యంజరిగిందన్న మాట నిజం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారాయి కదా? మిగిలిన సినిమాలన్నీ రిలీజులు అవుతున్నాయి కదా? మరి విరాటపర్వం సమస్యేంటి?
ఈ సినిమాని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయాలన్నది సురేష్ బాబు ఆలోచన. అమేజాన్ ప్రైమ్ తో అందుకు సంబంధించిన చర్చలు కూడా సాగాయి.కానీ రానా మాత్రం ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని అంటున్నాడట. దాంతో ఓటీటీనా? థియేటరా? అనే సందిగ్థం నెలకొంది. థియేటర్లలో విడుదల చేయాలంటే ఓ పెద్ద సమస్య ఉంది. ఇప్పటికే.... ప్రతీ వారం రెండు మూడు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. `విరాటపర్వం`కి సోలో రిలీజ్ డేట్ దొరకడం లేదు. సురేష్ బాబుకి తన సినిమాకి మరో సినిమా పోటీ రావడం ఇష్టం ఉండదు. అందుకే రిలీజ్‌డేట్ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు ఆలస్యం అయ్యే కొద్దీ ఈ సినిమాపై వడ్డీలు పెరుగుతుంటాయి. దాంతో పాటు ప్రేక్షకులకు ఈ సినిమాపై ఆసక్తి కూడా సన్నగిల్లుతుంది. ఎప్పటిదో పాత సినిమా అన్న ఫీలింగ్ ఇప్పటికే జనాలకు వచ్చేసింది. ఆలస్యం అయ్యే కొద్దీ అది మరింత పెరుగుతుంది. అందుకే ఈ సినిమా పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది. రానాని ఎలాగైనా ఒప్పించి ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేయాలన్నది సురేష్ బాబు ఆలోచన. ఈ విషయంలో ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు టాక్.