హీరోగానే కాకుండా, విభిన్న క్యారెక్టర్స్‌తో విలక్షణ నటుడిగా సత్తా చాటుతున్నాడు రానా. 'బాహుబలి' సినిమాలోని భళ్లాలదేవ పాత్ర ఆయన్ని యూనివర్సల్ స్టార్‌ని చేసింది. అలాగే 'ఘాజీ', నేనే రాజు నేనే మంత్రి' తదితర సినిమాలు కూడా రానా సినీ కెరీర్‌లో చెప్పుకోదగ్గ విభిన్న కథా చిత్రాలు. అయితే రానాకి ఇంకా విలక్షణ చిత్రాల్లో నటించాలని కోరిక ఉందట.
వాటిలో ముఖ్యంగా దేశభక్తి చిత్రాలైతే బావుంటుందని రానా అనుకుంటున్నాడట. అయితే కథ దొరికితే చూద్దాంలే అనుకోవడం లేదు రానా. ఈ తరహా కథలు ఎవరి దగ్గరైనా ఉంటే తనకి ఇన్‌ఫర్మేషన్ ఇవ్వాలంటూ ట్విట్టర్ ద్వారా తెలిపాడు రానా. అవును దేశభక్తిని చాటి చెప్పే కథలంటే ఎవరికి మాత్రం నచ్చవు చెప్పండి. కానీ రానా ప్రత్యేకించి ఈ కథల్లో ఎక్కువగా నటించాలని ఉందని చెప్పడం విశేషమే. మరింకేం కథా రచయితలు రానా కోసం దేశభక్తి కథలను తయారు చేయడానికి చక చకా తమ పెన్నులు కదపాల్సిందే. దేశభక్తిపై ఎన్ని సినిమాలు వచ్చినా సక్సెస్ అవుతాయి.
మరో పక్క రానా ఏమంత ఖాళీగా లేడిప్పుడు. ఫుల్ బిజీ. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. ప్రస్తుతం రానా నటిస్తున్న '1945' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. సత్యశివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరో పక్క హిందీలో 'వెల్‌కమ్ టు న్యూయార్క్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇది కాక 'హాథీ మేరీ సాథీ' అనే మరో హిందీ చిత్రంలోనూ రానా నటిస్తున్నాడు.