నటీనటులు: శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ తదితరులు
దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాణం : సూర్యదేవర నాగవంశీ.
సంగీతం: ప్రశాంత్ పిళ్ళై
సినిమాటోగ్రఫర్: దివాకర్ మణి
విడుదల తేదీ: ఆగస్టు 15, 2019
రేటింగ్: 2.5/5
అందరూ అనుకుంటారు గానీ, కొత్త కథలు చెప్పడంలోనే ఎలాంటి రిస్కూ ఉండదు. సినిమా అటూ ఇటూ అయినా, ఏదో కొత్తగా ప్రయత్నించాడు లే.. అనే సానుభూతి ఉంటుంది. పాత కథని తీసుకుని.. కొత్తగా చెప్పాలనే ప్రయత్నంలో, ఆ పాత కథని ఇంకాస్త పాడు చేస్తే... చాలా ముప్పు. పైపైన ఎన్ని హంగులు పోసినా... విమర్శల్ని ఎదుర్కోక తప్పదు.
అయినా సరే, మన దర్శకులు అలాంటి ప్రయత్నాలు పదే పదే చేస్తూనే ఉన్నారు. తాజాగా `రణరంగం` కూడా అలాంటి సినిమానే. తెలుగు తెరపై చాలాసార్లు చూసిన కథని, కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు సుధీర్ వర్మ. మరి ఈసారి వంటకం కుదిరిందా? పాత కథని పాడు చేశాడా? కొత్తగా చెప్పడంలో సక్సెస్ కొట్టాడా?
* కథ
విశాఖపట్నంలో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ జీవినం సాగిస్తుంటాడు దేవా (శర్వానంద్). తన కాలనీలోనే ఉండే గీత (కల్యాణీ ప్రియదర్శి)నిని ప్రేమిస్తాడు. గీత కూడా దేవాని ఇష్టపడుతుంది. సరిగ్గా అప్పుడే... రాష్ట్రంలో సంపూర్ణమద్యపాన నిషేధం అమలు అవుతుంది. మద్యాన్ని దొంగచాటుగా రవాణా చేస్తే డబ్బులు బాగా సంపాదించొచ్చన్న ఆశ పుడుతుంది దేవాకి. తన స్నేహితులతో కలిసి మద్యాన్ని అక్రమ రవాణా చేస్తుంటాడు.
ఇదే వ్యాపారంలో ఉన్న స్థానిక ఎం.ఎల్.ఏ సింహాచలం (మురళీశర్మ)కి దేవా వల్ల ఆటంకాలు ఏర్పడతాయి. దాంతో దేవాపై కక్ష పెంచుకుంటాడు సింహాచలం. తన వల్ల దేవా జీవితంలో అనేక ఆటంకాలు ఏర్పడతాయి. విశాఖ పట్నం వదిలి స్పెయిన్ వెళ్లిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. వీటికి కారణం ఏమిటి? ఈ ప్రయాణంలో దేవా నేర్చుకున్నదేంటి? అనేది తెరపై చూడాలి,
* నటీనటులు
శర్వా ఎప్పటిలా తన పాత్రకు న్యాయం చేశాడు. పాతికేళ్ల కుర్రాడిగా అల్లరిని, నలభై ఏళ్ల వయసున్నవాడిలా హుందాతనాన్నీ ప్రదర్శించాడు. డాన్‌గా గెటప్ కూడా సూటైంది. కాజల్ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. కాజల్ పాత్రే ఈ కథని మలుపు తిప్పుతుందనుకుంటే... ఆ పాత్ర నిస్సారంగా మారిపోయింది.
ఉన్నంతలో కల్యాణి ప్రియదర్శి ఫర్వాలేదనిపిస్తుంది. మురళీ శర్మ పాత్రని కొత్తగా డిజైన్ చేయాలనుకున్నాడు దర్శకుడు. అయితే.. అది కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. అజయ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర మెప్పిస్తారు.
* సాంకేతిక వర్గం
కళా దర్శకుడు రవీందర్ తన ప్రతిభను, అనుభవాన్నీ రంగరించారు. ఆర్ట్ విభాగం చాలా పకడ్బందీగా కనిచేసింది. 1990 కాలాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మాటలు ఆకట్టుకుంటాయి.
నేపథ్య సంగీతం కూడా ఓకే. అయితే కథ, కథనాల విషయంలో సుధీర్ ఏమాత్రం దృష్టి పెట్టలేదు. దాంతో నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషి ఫలించలేదు.
* విశ్లేషణ
గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. నాయకుడు నుంచి.. నేటి సత్య వరకూ ఎన్నో కథలు చూశాం. విన్నాం. వీటన్నింటికీ... `గాడ్ ఫాదర్` స్ఫూర్తి. మరోసారి అలాంటి కథని ఎంచుకున్నాడు సుధీర్ వర్మ. తెలిసిన కథని మళ్లీ చెప్పడం తప్పేం కాదు. కానీ... సరైన స్క్రీన్ ప్లే, ఆసక్తికకమైన మలుపులు అవసరం. అందుకు తగిన ప్రణాళికలు కూడా సుధీర్ వర్మ దగ్గర ఉన్నాయి. కానీ... వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమయ్యాడు.
స్క్రీన్ ప్లే నేరేషన్ కొత్తగా ఉండాలనుకుని.. కాస్త ఫ్లాష్ బ్యాక్‌నీ, కాస్త ప్రస్తుత కథనీ చెప్పాడు. తొలి సన్నివేశాల్లో ఈ స్క్రీన్ ప్లే బాగానే సాగినా, రాను రాను ఇబ్బంది పెడుతుంటుంది. అసలు ఇంత గజిబిజి ఈ కథకు అవసరం లేదు. స్ట్రయిట్ నేరేషన్ ఇస్తే... మరీ కథ సాదా సీదాగా సాగుతుందని భయపడి ఉంటాడు. అయితే ఈ స్క్రీన్ ప్లే వల్ల ప్రేక్షకుడు కాస్త ఇబ్బంది పడతాడు. బ్లాక్ టికెట్ నేపథ్యం, వాటర్ ట్యాంకర్ గొడవలో అరెస్టయి జైలుకి వెళ్లడం, బస్ స్టాప్ సీన్లు.. ఇవన్నీ బాగానే అనిపిస్తాయి. దొంగ సరుకు రవాణా చేయడానికి వేసిన ప్లానులు కూడా ఆకట్టుకుంటాయి.
ముక్కలు ముక్కలుగా చూస్తుంటే కొన్ని సీన్లు బాగానే రాసుకున్నాడు. కానీ.. అసలు కథలోకి వచ్చినప్పుడు దర్శకుడు తడబడ్డాడు. అయినా తొలి సగం బాగానే సాగిపోతుంది. కానీ ద్వితీయార్థంలో దర్శకుడి తడబాటు మరింత ఎక్కువైంది. స్పెయిన్ నేపథ్యంలో సన్నివేశాలు బాగా ఇబ్బంది పెట్టడంతో కథాగమనం బాగా నెమ్మదించింది. స్పెయిన్ ఎపిసోడ్లని వీలైనంత కుదించుకోవచ్చు. అక్కడ కాజల్ కూడా చేసిందేం లేదు. పతాక సన్నివేశాలు మరింత చప్పగా సాగిపోతున్నాయి అనుకున్నప్పుడు ఓ ట్విస్టు ఇచ్చారు. అయితే అప్పటికే ఈసినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. ఓ రొటీన్ కథని ఏమాత్రం మలుపులు లేకుండా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో రణరంగం చూస్తే అర్థమవుతుంది.
* ప్లస్ పాయింట్స్
శర్వా
సాంకేతిక వర్గ పనితనం
* మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
బోరింగ్ స్క్రీన్ ప్లే
* ఫైనల్ వర్డిక్ట్: మరో రొటీన్ కథ
- రివ్యూ రాసింది శ్రీ