మార్చి 30న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ నటించిన 'రంగస్థలం' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడే 'రంగస్థలం' మేనియా పీక్స్‌కి చేరిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో సినిమా కావడంతో ఓవర్సీస్ మార్కెట్ ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టింది. సాధారణంగా అయితే ఓవర్సీస్ మార్కెట్‌లో చరణ్ సినిమాలకి ఓ మోస్తరు డిమాండ్ మాత్రమే వుంటుంది. అక్కడి ఈక్వేషన్స్ వేరేగా వుంటాయ్ మరి. అయితే 'రంగస్థలం' అందుకు మినహాయింపుగా మారిందని చెప్పక తప్పదు.
'రంగస్థలం' ఓవర్సీస్ లెక్కలు ఇలా వుంటే, ఇండియాలో దాదాపు అన్ని చోట్లా 'రంగస్థలం' మేనియా అంచనాల్ని మించేలానే కన్పిస్తోంది. నైజాం, సీడెడ్ సహా తెలుగునాట అన్ని ఏరియాల్లోనూ 'రంగస్థలం' ప్రీ రిలీజ్ బజ్ కనీ వినీ ఎరుగని రీతిలో కన్పిస్తోంది. డిజిటల్ వ్యూస్ పరంగా 'రంగస్థలం'లోని ఆడియో సింగిల్స్ అన్నీ సూపర్బ్ రికార్డుల్ని క్రియేట్ చేసేశాయి. ఒకటొకటిగా వీడియో ప్రోమో సాంగ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి.
మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేస్తున్నాయి, అయితే మేనియా ఎంత పీక్స్‌లోకి వెళ్ళినా, బాబాయ్ పవన్‌కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'తో బయ్యర్లకు ఇచ్చిన షాక్ నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ అబ్బాయ్ రామ్‌చరణ్ 'రంగస్థలం' మీద కూడా కొంత పడినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావం మాటలకు మాత్రమే పరిమితమనీ, ప్రీ రిలీజ్ బజ్ లెక్కల్లో చూస్తే 'రంగస్థలం' సంచలనాలకు ఆకాశమే హద్దు కాబోతోందని మెగా అభిమానులు చెప్పడం మామూలే.
సుకుమార్ దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' సినిమాలో చరణ్ సరసన తొలిసారిగా సమంత హీరోయిన్‌గా నటించిన సంగతి తెల్సిందే. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో పాటలు సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసేశాయ్.