'రంగస్థలం' సినిమా నుండి చిట్టిబాబు పాత్రను పరిచయం చేస్తూ చరణ్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇది అధికారికంగా విడుదల చేసిందే. అయితే ఆ తర్వాత 'రంగస్థలం'లో సమంతని చూస్తారా? అంటూ కీలకమైన సమంత స్టిల్స్ బయటికి వచ్చేశాయి. పక్కా క్లారిటీతో ఈ స్టిల్స్ లీకైపోయాయి.
దాంతో ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ వారు పోలీసులనాశ్రయించారు. కొందరు కావాలనే కుట్రపూరితంగా ఈ స్టిల్స్‌ని లీకు చేశారంటూ, అట్టి వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ ఈ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో 'జై లవకుశ' సినిమా నుండి వీడియోలు, స్టిల్స్ లీకులపై కళ్యాణ్‌రామ్ కూడా పోలీసులకు ఇట్టి ఫిర్యాదులు చేశారు. అలాంటి వారిలో కొందరిని అరెస్టు చేశారు కూడా అప్పుడు. అరెస్టుల సంగతి ఎలా ఉన్నా, ఈ లీకుల గోల మాత్రం తప్పడం లేదు.
విడుదలకు ముందు లీకుల భాగోతం, విడుదలయ్యాక పైరసీల భూతం. సినీ ఇండస్ట్రీని దెబ్బ తీస్తున్నాయి. అరెస్టులు, వార్నింగ్‌లు ఎన్ని జరుగుతున్నా, ఈ మహమ్మారిని అంతం చేయడం మాత్రం వల్ల కాని పని అవుతోంది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జవాన్' సినిమాకి ఈ పైరసీ భూతం తాకిడి బాగా తగిలింది. ఉదయం సినిమా విడుదలైతే, సాయంత్రం సినిమా మొత్తం పైరసీ చేసి బస్సుల్లో ప్రసారం చేసేయడం నిజంగా బాధాకరమైన విషయమే. ఆ సినిమా నిర్మాతలు ఈ విషయంలో అప్పుడు సీరియస్‌గా స్పందించారు.
ఇక 'బాహుబలి'కీ ఈ లీకుల బెడద తప్పలేదు. అయితే తన దాకా వస్తే కానీ నొప్పి తెలీదు అన్న చందంగా తయారైంది. అలా కాకుండా, ఏ ఒక్కరికో కష్టం వచ్చినప్పుడు, ఆ ఒక్కరు మాత్రమే స్పందించి, మిగతా వారు పక్కనుండకుండా, సమస్య అందరిదీ అనుకుని, ఒకేసారి స్పందించి, ఉమ్మడిగా పట్టు పడితే, ఈ మహమ్మారిని పారద్రోలడం అసాధ్యమైన పని అయితే కాదని గమనించాలి. ప్రస్తుతం 'రంగస్థలం' వంతు వచ్చింది. సో ఈ చిత్ర నిర్మాతలు స్పందిస్తున్నారు. అంతే!