మార్చి 30 అంటే సరిగ్గా నెలరోజుల క్రితం ఇదే రోజు 'రంగస్థలం' సినిమా విడుదలైంది. ఇలాంటి సినిమాలు అసలు ఆడతాయా? టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో, కొత్త కొత్త టెక్నికల్ అంశాలతో తెరకెక్కే సినిమాలకు ఆదరణ దక్కుతుంది. కానీ టెక్నాలజీకి దూరంగా, కమర్షియల్ అంశాలకు మరింత దూరంగా డీ గ్లామరస్ ఎట్మాస్పియర్‌లో తెరకెక్కిన 'రంగస్థలం' సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ, తెరకెక్కించిన చిత్ర యూనిట్‌కే కాదు, చూడాల్సిన ప్రేక్షకుల్లో కూడా నెలకొంది.
సినిమా విడుదలైంది. ఓపెనింగ్ డే నుండే రికార్డులు ఈ సినిమా సొంతమయ్యాయి. కథ నమ్మి, రంగంలోకి దిగిన హీరో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాన్ఫిడెన్సే ఈ సినిమాకి, చిత్ర యూనిట్‌కీ ఎంతో బలాన్నిచ్చింది. ఆ బలమే, ఇంతటి విజయాన్ని సినిమాకి కట్ట బెట్టింది. స్టార్‌డమ్ ఉన్న ఏ హీరో కూడా ఇలాంటి కథలో నటించాలని అనుకోడు. కానీ ముందూ వెనకా ఆలోచించకుండా, కథపై పూర్తి నమ్మకంతో ఈ సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డాడు చరణ్. డైరెక్టర్ సుకుమార్‌ని పూర్తిగా నమ్మాడు.
చరణ్ నమ్మకాన్ని, సుకుమార్ నిలబెట్టుకున్నాడు. ఈ ఇద్దరి కొత్త ప్రయత్నానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. సినిమా విడుదలై నెల రోజులు కావస్తోంది. అయినా ఇంకా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ధియేటర్స్‌లో హౌస్‌ఫుల్స్ నమోదు కావడమే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మధ్యలో 'భరత్ అనే నేను' వంటి పెద్ద సినిమా విడుదలైనా కానీ, చరణ్ 'రంగస్థలం' దుమ్ము రేపుతూనే ఉంది.