హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ స్టార్ డైరక్టర్ అయిపోయాడు. మొదటి నుంచి విభిన్న సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ప్రశాంత్ 'హనుమాన్' తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా 'అ!', సెకండ్ సినిమా జాంబిరెడ్డి, మూడో సినిమా హనుమాన్ కే స్టార్ డమ్ తెచ్చుకోవటం గమనార్హం. హనుమాన్ సినిమా తరవాత పలువురు బాలివుడ్ స్టార్స్ కూడా ప్రశాంత్ వర్మతో సినిమా చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో ఎక్కువగా వినిపించిన పేరు రణవీర్ సింగ్ . ఫైనల్ గా ప్రశాంత్ రణవీర్ కి కథ చెప్పటం, సినిమా షెడ్యూల్ స్టార్ట్ అవటం, టైటిల్ రాక్షస్ అని ఫిక్స్ చేయటం జరిగిపోయింది.
చడీ చప్పుడు లేకుండా రణవీర్ తో ప్రశాంత్ సినిమా మొదలుపెట్టేశాడు అన్న న్యూస్ బయటికి వచ్చిన కొన్ని రోజులకే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ప్రచారం మొదలయ్యింది. కారణం రణవీర్ కి, దర్శకుడు ప్రశాంత్ వర్మకి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని టాక్. వెంటనే ఈ వార్తలను ప్రశాంత్ ఖండించాడు. ప్రాజెక్ట్ ఆగిపోలేదని, రణవీర్ లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిందని స్పష్టం చేసాడు. కానీ ఇంతలోనే మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
హీరో, దర్శకుడు, నిర్మాత ముగ్గురు కలిసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ నోట్ లో ‘ప్రశాంత్ చాలా టాలెంటెడ్, మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలని అనుకున్నాం కానీ ఈ ప్రాజెక్ట్ కు ఇది సరైన సమయం కాదు, భవిష్యత్తులో ఆ ఎక్సైటింగ్ ప్రాజెక్టు కోసం కలుస్తాం' అని రణవీర్ సింగ్ చెప్పారు. 'రణవీర్ కు ఉన్న ఎనర్జీ, టాలెంట్ చాలా అరుదు, భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు మేము కలిసి వర్క్ చేస్తాం అని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కేవలం ఇప్పుడు ఈ మూవీని పోస్ట్ ఫోన్ చేసినట్లు టీమ్ ప్రకటించింది.