సీనియర్ నటుడు రావు గోపాలరావు తనయుడు రావు రమేష్ మొదట్లో టీవీ సీరియల్స్‌లో ఎక్కువగా కన్పించేవారు. ఇప్పుడాయన వెండితెరపై సక్సెస్‌ఫుల్‌గా నటనా కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడేనని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న రావు రమేష్‌కి, తండ్రిని మించిన తనయుడనే ప్రశంసలు దక్కుతున్నాయి. తనకు మాత్రమే సాధ్యమయ్యే డిక్షన్‌తో తెలుగు తెరపై విలక్షణ పాత్రలతో దూసుకెళ్తున్నారు రావు రమేష్. నెగెటివ్ రోల్స్‌లో సత్తా చాటడమే కాకుండా, బాధ్యతగల తండ్రి పాత్రలో రావు రమేష్ ప్రదర్శిస్తున్న వైవిధ్యం అందర్నీ ఆకట్టుకుంటోంది. తండ్రి పాత్రల్లో ఆయన కనబరిచే నటనా ప్రతిభ నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఉంటోంది ఈ తరం నటీ నటులకు. ఆయన నెగిటివ్ గెటప్ వేసినా, పోజిటివ్ గెటప్ వేసినా సరే తన పాత్రలో నటిస్తాడు అనే కన్నా జీవించేస్తున్నాడు అంటేనే సరిపోతుంది. ఇటీవల వచ్చిన పలు చిత్రాల్లో ఆయన తండ్రి పాత్రల్లో ప్రతీదీ హైలైటే అని చెప్పాలి. సినిమా సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా కానీ ఆయన పాత్ర మాత్రం అలా గుర్తుండిపోతుంది అంతే. తెలుగు తెరపై రావు గోపాలరావు ఓ చరిత్ర. విలక్షణ పాత్రలతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారాయన. ఆయన తనయుడిగా నటవారసత్వాన్ని అందుకున్న రావు రమేష్, చిన్న వయసులోనే చాలా చాలా బరువైన పాత్రల్లో కనిపించేస్తూ సత్తా చాటుతుండడం అభినందనీయమే.