సోషల్ మీడియాలో జనాలు మరీ చెలరేగిపోతున్నారు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ల పైచాచికత్వానికి సోసల్ మీడియాని ఓ వేదికగా చేసుకుంటున్నారు. విజయ్ సేతుపతి విషయంలో కనిపిస్తున్న ట్వీట్టే ఇందుకు నిదర్శనం. `800` సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడన్న సంగతి తెలిసినప్పటి నుంచీ... సోషల్ మీడియాలో విజయ్ ని టార్గెట్ చేస్తూ ఓ వర్గం తయారైంది. ఈ సినిమాలో విజయ్ నటించకూడదని, అలా నటిస్తే తమిళులకు ద్రోహం చేసినట్టే అని గోల గోల చేసింది.
మురళీధరన్ తమిళ ద్రోహి అని, అలాంటి వ్యక్తిపై బయోపిక్ తీస్తే, విజయ్ ఎలా నటిస్తాడని చాలామంది ప్రశ్నించారు. వాళ్ల వాదనలో, కోపంలో కాస్త అర్థం ఉన్నట్టే కనిపించింది. అందుకే విజయ్ సేతుపతి కూడా ఆలోచించాడు. ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. కేవలం తమిళుల మనోభావాలు దెబ్బ తినకూడదన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే... విజయ్ ని టార్గెట్ చేసిన వర్గం కోపం తప్పలేదు. వాళ్లు ఇంకా విజయ్ ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ అగంతకుడు విజయ్‌సేతుపతి చిన్న కూతురిపై అసభ్యంగా ట్వీట్ చేశాడు. తనని రేప్ చేస్తానని బహిరంగంగా హెచ్చరించాడు. విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నా, ఇలాంటి బెదిరింపులేమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇది నిజంగా సిగ్గుమాలిన చర్య.
జనాలు ఇంత నీచంగా ఆలోచిస్తారా? సినిమాని సినిమాగా చూడలేరా? కళాకారుల కుటుంబాల్ని ట్వీట్లతో హింసకు గురి చేస్తారా? అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ధోనీ విషయంలోనూ ఇదే జరిగింది. చెన్నై జట్టు వరుస ఓటములకు బాధ్యుడ్ని చేస్తూ.. ధోనీ కూతుర్ని రేప్ చేస్తానంటూ ఓ అగంతకుడు ట్వీట్ చేయడం దుమారం రేపింది. పోలీసులు ఆ అగంతుకుడ్ని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఇప్పుడు విజయ్ సేతుపతి కూతురుపై ఇలాంటి కామెంట్లు చేసినవాడ్నీ వెదికి పట్టుకోవాలని, కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.