బుల్లితెర బ్యూటీ రష్మి గౌతమ్, వెండితెరపైనా తన అందాల విందుతో హల్‌చల్ చేసింది. ‘గుంటూరు టాకీస్’ తదితర సినిమాల్లో నటించిన రష్మి గౌతమ్ మళ్ళీ ఎందుకో వెండితెరను లైట్ తీసుకుని, బుల్లితెర మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. చాలాకాలం క్రితమే సినిమాల్లో హల్‌చల్ చేసిన ఈ బ్యూటీకి పాపులారిటీ దక్కింది మాత్రం బుల్లితెర కారణంగానే. ‘జబర్‌దస్త్’ కామెడీ షో ఈ బ్యూటీని స్టార్‌గా మార్చేసింది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో వున్నాయట. కరోనా లాక్ డౌన్ ముగిశాకనే ఆ సినిమాల వివరాలు చెబుతానంటోంది రష్మి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ స్పెషల్ సాంగ్ చేయాలంటూ కొందరు అభిమానులు అడిగితే, ‘ఆ ఛాన్స్ వస్తే మిస్ అవను కదా.? ఛాన్స్ వస్తుందేమో వేచి చూద్దాం..’ అని తనదైన స్టయిల్లో సమాధానమిచ్చింది రష్మి. నిజానికి, ఓ దశలో రష్మితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు. అయితే, కథల ఎంపికలో రష్మి చాలా తప్పటడుగులే వేసింది. అన్నీ బోల్డ్ రోల్స్ చేసేయడంతో, ఆ బోల్డ్‌నెస్ కూడా బోర్ కొట్టేసింది జనానికి. హీరోయిన్‌గా సత్తా చాటే టాలెంట్ రష్మిలో వున్నా, కాలం కలిసి రాకపోవడం గమనార్హం. ఏమో, గుర్రం ఎగరావొచ్చు. సినీ పరిశ్రమలో ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా జరగొచ్చు. రష్మిక దశ తిరిగి, యంగ్ టైగర్‌తో స్టెప్పులేసే ఛాన్స్ కొట్టేస్తుందేమో చూడాలి.