ఏ విషయాన్నయినా కుండబద్దలుగొట్టేసే అతి కొద్దిమంది హీరోయిన్లలో రష్మిక మండన్న పేరు కూడా ఖచ్చితంగా వుంటుంది. అభిమానుల్ని వెనకేసుకురావడంలో చాలామంది హీరోయిన్లకంటే చాలా చాలా బెటర్ రష్కిక. ఎవరన్నా తన అభిమానుల్ని విమర్శిస్తే రష్మిక అస్సలూరుకోదు. అలాంటి రష్మిక, ‘నన్ను ఎగరనివ్వండి.. నా రెక్కలు కత్తిరించొద్దు..’ అని సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఓ బటర్ ఫ్లై ఫొటో ముందు నిలబడి, ఆ రెక్కలు తనకు అతికించుకున్నట్లుగా ఫొటోకి పోజులిచ్చింది రష్మిక. ఆ ఫొటోకి క్యాప్షన్‌గా ‘నా రెక్కలు కత్తిరించొద్దు.. నన్ను ఎగరనివ్వండి’ అని పేర్కొందామె.
అయితే, ఇది ఆమె అభిమానుల్ని ఉద్దేశించి అన్న మాటగానే పరిగణించాలా.? దురభిమానులకు షాకిచ్చిందా.? లేదంటే, ఇంకేమైనా పెద్ద కథ వెనకాల వుందా.? అని ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. రష్మిక గ్లామర్ విషయంలోనూ, ఆమె రూపం విషయంలోనూ ఈ మధ్య కొన్ని నెగెటివ్ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. వాటికి బహుశా రష్మిక ఇలాంటి కౌంటర్ ఇచ్చి వుండొచ్చునని అంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం రష్మిక టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అత్యద్భుతమైన ఫాంలో కొనసాగుతోంది. నెంబర్ వన్ ఛెయిర్ కోసం పూజా హెగ్దేతో పోటీ పడుతోంది రష్మిక.