గత మూడు నాలుగు నెలలుగా సినిమా షూటింగులకు బ్రేక్ రావడంతో సెలబ్రిటీలందరూ దాదాపుగా ఇంటిపట్టునే ఉంటున్నారు. కొందరు కసరత్తులు చేస్తూ ఆరోగ్యంపై, ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కొందరేమో కొత్త సినిమా కథలు వింటున్నారట. సినిమాలు, వెబ్ సీరీసులు చూడడం, అలవాటు ఉంటే పుస్తకాలు చదవడం.. ఇలా ఎన్ని పనులు చేసినా బోర్ కొట్టకుండా ఎలా ఉంటుంది? అందుకే రష్మిక లాంటి బ్యూటీలు అభిమానులతో కూడా చాట్ చేస్తూ లైఫ్ లో స్పైస్ తీసుకొస్తున్నారు.
రష్మిక షూటింగులను తెగ మిస్సవుతోందట. ఈ విషయాన్ని ఒక ఇన్స్టా పోస్టులో తెలిపింది. ఇక అభిమానులతో లైవ్ చాట్ కూడా చేసింది. సాధారణంగా లైవ్ చాట్ అనగానే అభిమానులు జర్నలిస్టులకు అన్నయ్యల తరహాలో ప్రశ్నలు వేస్తారు. నెక్స్ట్ సినిమా దగ్గర నుంచి మొదలు పెట్టి పెళ్లి వరకూ అన్నీ అడుగుతారు. అయితే రష్మిక మాత్రం రూటు మార్చి తన ఫాలోయర్లను ప్రశ్నలు అడిగింది. వారికున్న సినీ పరిజ్ఞానం ఎంతో పరిక్షించింది.
కిరిక్ పార్టీ సినిమాలో నా పాత్ర పేరేంటి?, భీష్మ సినిమాలో నేను పని చేసే కంపెనీ పేరు తెలుసా?, ఇప్పటి వరకూ నేను ఎన్ని సినిమాల్లో నటించాను? ఇలా బోర్నవిటా క్విజ్ కాంటెస్ట్ లో వేసే ప్రశ్నల టైపులో ప్రశ్నలు సంధించింది. అయితే సబ్జెక్ట్ మాత్రం ఒకటే.. 'రష్మిక'. మొత్తానికి మంచి టైమ్ పాసు!