సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. అందులోనూ కథానాయికల్ని మరింత అందంగా చూపించాలి. హీరోయిన్లూ అలాంటి పాత్రలవైపే మొగ్గు చూపిస్తుంటారు. మరింత అందంగా కనిపించాలని తహతహలాడిపోతారు. అయితే కొన్నిసార్లు వాళ్లు డీ గ్రామర్ పాత్రల్నీ పోషించాల్సివస్తుంది. ఇప్పుడు రష్మిక అదే చేస్తోంది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్పలో.... రష్మిక కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీవల్లీగా తను కనిపించబోతోంది. అయితే ఇది చాలా డీ గ్లామర్ పాత్ర. ఎంతంటే.. అసలు రష్మికకూ, శ్రీవల్లీకి చాలా తేడా ఉన్నంత. ఈ రెండింటికీ ఎంత తేడానో చూపిస్తూ.. రష్మిక సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసింది. లంచ్ బ్రేక్‌లో తన చేతిపై మేకప్ ఉన్న ప్లేస్‌కి, లేని ప్లేస్‌కి తేడా చూపిస్తూ ఓ ఫొటో పంచుకున్నారు. దీనిని బట్టి తన పాత్ర ఎంత డీ గ్లామర్‌గా ఉండబోతుందో తెలుస్తోంది.
రంగస్థలంలో సమంతదీ డీ గ్లామర్ పాత్రే. అలా నటించడం వల్ల.. సమంతకు మరింత ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆ పాత్ర కూడా గుర్తుండిపోయింది. ఇప్పుడు రష్మిక పాత్రకూ అలాంటి ప్రశంసలు దక్కుతాయేమో చూడాలి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీమేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.