బెంగళూరు బ్యూటీ రష్మిక మండన్న, తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్. తమిళంలోనూ వరుస సినిమాలకు కమిట్ అవుతోంది ఈ బ్యూటీ. పనిలో పనిగా బాలీవుడ్ పైనా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆమె రెండు సినిమాల్ని ఖరారు చేసుకుంది హిందీ సినీ పరిశ్రమలో. ఇంతకీ, బాలీవుడ్ ప్రయాణంతో సౌత్ సినిమాకి ‘గుడ్ బై’ చెప్పస్తున్నట్టేనా.? అన్న ప్రశ్న ఆమెకు ఎదురవుతోంది.
బాలీవుడ్ సినిమాలు చేస్తే, సౌత్‌ని నిర్లక్ష్యం చెయ్యాలా.? అని ఎదురు ప్రశ్నిస్తోంది రష్మిక. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ, సౌత్‌లో స్టార్‌డమ్ కొనసాగిస్తున్న పూజా హెగ్దే తదితరుల గురించి ప్రస్తావించిన రష్మిక, హిందీ సినిమాల్లో అవకాశం రావడాన్ని ఓ అదృష్టంగా భావిస్తున్నాననీ, అంత మాత్రాన దక్షిణాది సినిమాలపై చిన్న చూపు వుండబోదని స్పష్టతనిచ్చేసింది. తెలుగు సినిమా తనను స్టార్‌గా మలచిందంటోన్న రష్మిక, కన్నడ సినీ పరిశ్రమ నుంచి తన ప్రయాణం మొదలైందనీ, దేన్నీ తక్కవ చేసి చూడలేననీ చెప్పుకొచ్చింది.
తెలుగులో ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది ‘పుష్ప’. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు కొట్టిన రష్మకి, ఈ ఏడాది మరింత జోరు ప్రదర్శిస్తాననే నమ్మకంతో వుంది.