మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడు. అయితే, పవన్ - త్రివిక్రమ్ మధ్య విభేదాలంటూ తరచూ గాసిప్స్ వస్తుంటాయి. నాన్సెన్స్.. అని ఆ ప్రచారాన్ని ఖండించేలా, ఇద్దరూ తరచూ కలుసుకుంటుంటారు. ఆ సంగతి పక్కన పెడితే, పవన్ తదుపరి సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ రంగంలోకి దూకాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారు.
రానా దగ్గుబాటి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెల్సిందే. మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’కి ఇది తెలుగు రీమేక్. పేరుకి రీమేక్ అయినా, సినిమాలో చాలా మార్పులు వుండబోతున్నాయట. పవన్ కళ్యాణ్, తన వద్దకు ఈ సినిమా రాగానే, ఆయనే త్రివిక్రమ్ సలహా అడిగారనీ, అలా సినిమా పట్టాలెక్కిందని అంటున్నారు. నిజానికి, ఇదొక మల్టీస్టారర్ తరహా సినిమా. చాలా థ్రిల్లింగ్‌గా సినిమా వుంటుంది. స్క్రీన్ ప్లే పరంగా చాలా అద్భుతంగా వుంటుంది.
తెలుగు నేటివిటీకి తగ్గ విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే, స్క్రీన్ ప్లే పరంగా ఇబ్బందులు రాకుండా వుండేందుకే త్రివిక్రమ్‌ని పవన్ రంగంలోకి దించారట. ఇక, ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ భారీ రెమ్యనరేషన్ కూడా అందుకోనున్నట్లు సమాచారం.