'ఛలో' సినిమాతో తొలి అడుగులోనే హిట్టు అందుకుంది రష్మిక. 'గీత గోవిందం'తో స్టార్ కథానాయికల లిస్టులో చేరిపోయింది. `దేవదాస్`లోనూ అలరించింది. ఇప్పుడు రష్మిక చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. టాలీవుడ్‌లోని అత్యంత బిజీ కథానాయికలలో రష్మిక కూడా చేరిపోయింది.
తెరపై ఎంత సందడిగా ఉంటుందో... బయట కూడా అంతే అల్లరి చేస్తుంటుంది. చిన్నప్పుడైతే తన అల్లరికి అడ్డే ఉండేది కాదట. అన్నట్టు రష్మికలో ఓ మంచి దొంగ కూడా ఉందండోయ్. ఇంట్లో పది రూపాయల నోట్లు, ఇరవై రూపాయల నోట్లు మాయం చేసేసేదట. అయితే ఆ డబ్బులన్నీ పేదలకు పంచి పెట్టేదట. ``మనం ఎవరికైనా మంచి చేస్తే అది ఏదో ఓ రూపంలో వెనక్కి తిరిగి వస్తుందన్నది నా నమ్మకం. అందుకే అలా ఇంట్లో డబ్బులు దొంగిలించి పంచేదాన్ని. బట్టలు, బొమ్మలు కూడా పంచిపెట్టేదాన్ని.
చిన్నప్పుడు ఇదంతా సరదాగా అనిపించేది. ఇప్పుడు గుర్తు చేసుకుంటే - సొంతింట్లోనే ఎందుకు దొంగగా మారాను అని అనిపిస్తోంది. ఏం చేసినా మంచి పని కోసమే కదా`` అని తన చిననాటి రోజుల్ని గుర్తు చేసుకుంది రష్మిక.