నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: నవీన్ నూలి
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2/5
థ్రిల్లర్ కథలకు ఈమధ్య మరింత గిరాకీ పెరిగింది. పెద్ద హీరోలు సైతం... ఈ జోనర్‌లో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రతినాయక ఛాయల్లో ఉండే పాత్రలకు మరింత డిమాండ్. తమలోని కొత్త నటుడ్ని బయటకు తీసుకురావచ్చన్న ఆశ, ధీమా హీరోలకు కలుగుతుంది. `రావణాసుర` లాంటి కథని రవితేజ ఒప్పుకోవడానికి కూడా కారణం అదే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ రవితేజకు ఎంత వరకూ సూటైంది? ఇందులో రావణాసురుడు ఎవరు? రాముడెవరు?
కథ:
హైదరాబాద్ లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఓ హత్య కేసులో ఓ పెద్ద ఫార్మా కంపెనీ ఎండీ (సంపత్ రాజ్) ఇరుక్కుపోతాడు. కూతురు హారిక (మేఘా ఆకాష్) తండ్రిని కాపాడుకోవడానికి రంగంలోకి దిగుతుంది. నగరంలోనే పేరుపడ్డ క్రిమినల్ లాయర్ మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా)ని ఈ కేసు టేకప్ చేయమని అడిగితే, ఆమె నిరాకరిస్తుంది. తన దగ్గర జూనియర్ గా పని చేస్తున్న రవీంద్ర (రవితేజ) ప్రొగ్బలంతో మహాలక్ష్మి ఈ కేసు డీల్ చేయడానికి ఒప్పుకొంటుంది. మరోవైపు ఈ హత్యకేసుని హనుమంతరావు (జయరామ్) ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. తనకు ఈ కేసులో ఎలాంటి క్లూస్ దొరికాయి? తన క్లైయింట్ ని రవీంద్ర కాపాడగలిగాడా, లేదా? అసలు ఈ మర్డర్స్ చేస్తోంది ఎవరు? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
`వాడు క్రిమినల్ లాయర్ కాదురా, లా తెలిసిన క్రిమినల్` అనే డైలాగ్ ఈ సినిమా ట్రైలర్‌లో ఉంది. దాన్ని బట్టి ఈ సినిమా కథేంటో అంచనా వేయొచ్చు. ఓ లాయర్, న్యాయ శాస్త్రంలోని లోపాల్ని వాడుకొంటూ, తన ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడన్నది కథ. నిజానికి ఈ తరహా కథలు ఇది వరకు చాలానే వచ్చాయి. కాకపోతే ఇందులో ప్రొస్థటిక్ మేకప్ అనే నేపథ్యాన్ని ఎంచుకొన్నారు. ఈ ఎలిమెంట్ వల్ల కథకు కాస్త కొత్తదనం అబ్బింది. తొలి సీన్‌లోనే ఓ మర్డర్ జరుగుతుంది. ఆ తరవాత ఇన్వెస్టిగేషన్‌మొదలవుతుంది. అలా.. కథలోకి ప్రేక్షకుడ్ని చాలా త్వరగా లాక్కెళ్లిపోయాడు దర్శకుడు.
హీరో రవితేజ ఎంట్రీతో ఇంకాస్త జోరు పెరగాలి. కానీ రవితేజ రాకతో.. స్పీడు బ్రేకర్లు పడిపోతాయి. రవితేజ సినిమా అంటే ఇలా ఉండాలి.. అనే కొన్ని కొలతలు ఉన్నాయి. వాటి కోసం కొన్ని సీన్లు, పాటలు ఇరికించడం వల్ల... అసలు కథ సైడ్ ట్రాక్ లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి కాలక్షేపపు వ్యవహారాలు లేకుండా చూసుకోవాల్సింది. జయరామ్ రాకతో మళ్లీ ట్రాక్ ఎక్కినా.. అది ఎంతో సేపు నిలవదు. క్రమేపీ జయరాం పాత్రకు ప్రాధాన్యం లేకుండా చేసి... అర్థం లేని లాజిక్కులతో తన చేతులు కట్టేశారు.
హీరోకి ఛాలెంజెస్ ఎదురవ్వడం, అందులోంవచి తెలివిగా బయటపడడం.. ఇలాంటి కథలకు చాలా ముఖ్యం. కానీ ఇవి రెండూ ఈ సినిమాలో లేవు. రావణాసురలో రవితేజ పాత్రకు ఎలాంటి ఛాలెంజ్‌లూ ఉండవు. తను అనుకొన్నది అనుకొన్నట్టు జరిగిపోతుంటుంది. అలాంటప్పుడు కథలో మజా ఏముంటుంది? అసలు ట్విస్ట్ రివీల్ అయ్యేసరికే.. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో ప్రేక్షకుడికి చూచాయిగా ఓ హింట్ అందుతూనే ఉంటుంది. దాంతో ట్విస్ట్ రివీల్ చేసినా, పెద్దగా థ్రిల్లింగ్ గా అనిపించదు.
సెకండాఫ్ లో హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందన్న విషయం ప్రేక్షకుడి ఊహకు అందుతూనే ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ పేలవంగా తీర్చిదిద్దారు. ఎప్పుడైనా రివైంజ్ డ్రామాలో.. హీరోకి జరిగిన అన్యాయం చాలా కీలకం అవుతుంది. అక్కడ ప్రేక్షకుడు కూడా `అయ్యో.. హీరోకి ఇలా జరిగిందా` అని బాధ పడాలి. అప్పుడే ఆ పాత్రతో ట్రావెల్ చేయగలుగుతాడు. కానీ ఇక్కడ అదేం ఉండదు. చాలా సహజమైన సీన్లతో, అసహజమైన లాజిక్కులతో క్లైమాక్స్ వరకూ బండి లాక్కు వచ్చేశారు. క్లైమాక్స్ కూడా..
ఏమంత ఇంప్రెసివ్‌గా అనిపించదు.
నటీనటులు:
ఇటు రవితేజకీ, అటు సుశాంత్ కీ ఇది కొత్త తరహా సినిమా. ఇద్దరూ ఇలాంటి పాత్రల్ని ఇది వరకు చేయలేదు. రవితేజ పాత్రలో రెండు పార్శ్యాలు ఉంటాయి. రెండో కోణం కాస్త షాకింగ్ గా ఉంటుంది. రవితేజ ఇలాంటి పాత్రలో నటించడానికి ఎందుకు ఒప్పుకొన్నాడు? అనే డౌటు వస్తుంది. కానీ అలా ఎందుకు చేయాల్సివచ్చిందో రీజనింగ్ ఇచ్చి సరిపెట్టాడు దర్శకుడు. పాటల్లో, ఫైట్స్ లో మునిపటి ఈజ్ చూపించగలిగాడు రవితేజ.
సుశాంత్ కూడా కొత్తగా ఉన్నాడు. ఇలాంటి పాత్రలకు తను రాను రాను బెస్ట్ ఛాయిస్ అవుతాడు. మురళీ శర్మ, సంపత్ రాజ్ పరిధిమేర చేశారు. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నమాటే కానీ, ఎవరి పాత్రకూ సరైన ప్రాధాన్యం లేదు. ముఖ్యంగా అను ఇమ్మానియేల్ ని రెండు సీన్లకే పరిమితం చేశారు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాకు కథ, మాటలు అందించింది శ్రీకాంత్ విస్సా. ఈ కథలో... ఓ బెంగాలీ సినిమా ఛాయలు కనిపిస్తాయి. మాటలు గుర్తుంచుకొనేలా లేవు. భీమ్స్‌పాటలతో `ధమాకా` మెరుపుల్లేవు. నేపథ్య సంగీతం బాగుంది.మరీ ముఖ్యంగా ఎలివేషన్ సమయంలో.
సుధీర్ వర్మ మంచి మేకర్. చిన్న బడ్జెట్ ఇచ్చినప్పుడే క్వాలిటీ సినిమా తీశాడు. వాటితో పోలిస్తే.. రావణాసుర మార్క్ అందుకోనట్టే. ఓ రివైంజ్ డ్రామా ఇది. రవితేజ కోసం అటూ ఇటూ మార్చడం వల్ల.. కథలో సోల్ పోయింది. ఫీల్ తగ్గింది. టోటల్ గా అటు థ్రిల్లర్ గానూ, రివైంజ్ డ్రామాగానూ మిగలకుండా పోయింది.
ప్లస్ పాయింట్స్:
రవితేజ
కొన్ని ట్విస్టులు
మైనస్ పాయింట్స్:
సరైన క్యారెక్టర్లు రాసుకోకపోవడం
కథ, కథనాలు
ఫైనల్ వర్డిక్ట్: `మేకప్` పాడైపోయింది!