క్రియేటివిటీలో రవిబాబు క్రియేటివిటీ పూర్తిగా వేరు అనే చెప్పాలి. ఆయన తెరకెక్కించే సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ, తన ప్రతీ సినిమాలోనూ ఏదో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు. అలా సక్సెస్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతాడు. తాజాగా రవిబాబు దర్శకత్వంలో వస్తున్న వైవిధ్యభరిత చిత్రం 'అదుగో'.
ఇందులో ఓ పందిపిల్ల హీరో అన్న సంగతి ఎప్పటి నుండో అందరికీ తెలిసిందే. ఈ పందిపిల్లను పట్టుకుని పలు రకాలుగా రవిబాబు గత రెండేళ్లుగా ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నాడు. అయితే ఇక ఈ పందిపిల్ల ధియేటర్స్‌లో సందడి చేసేందుకు టైం దగ్గర పడింది. దసరాకి ఎన్టీఆర్ 'అరవింద సమేత..', విజయ్ దేవరకొండ 'నోటా' తదితర చిత్రాలతో పాటుగా నేనేం తక్కువ కాదంటూ మన బంటీ కూడా పోటీ పడుతోంది. గట్టి పోటీ ఇస్తానంటోంది.
దమ్ముంటే కాస్కోమని సవాల్ కూడా విసిరేస్తోంది. అవునండీ దసరాకే బంటీ (పందిపిల్ల) హీరోగా వస్తున్న 'అదుగో' చిత్రం విడుదల కానుందట. ఇండియన్ సినిమా చరిత్రలోనే పూర్తి స్థాయి 3డీ యానిమేషన్ ఫిలింగా ఈ చిత్రం రూపొందుతోందట. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ అవుతుండడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బంటీ (పందిపిల్ల)తో పాటు రవిబాబు, అభిషేక్ వర్మ, నభా నటేష్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. దసరా అంటే పిల్లలకు సెలవులు. పిల్లలు మెచ్చే జోనర్‌లో వస్తున్న ఈ 'అదుగో' చిత్రం ఎలాంటి రిజల్ట్‌ని అందుకుంటుందో చూడాలిక.