మాస్ మహారాజ్ రవితేజ లాంగ్ గ్యాప్ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వచ్చేస్తున్నాడు. 'రాజా ది గ్రేట్' వెల్కమ్ టు మై వరల్డ్ అంటున్నాడు. సాదా సీదా మాస్ మసాలాగా కాకుండా, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది ఈ సినిమా. రవితేజ అంధుడిగా నటిస్తున్న సినిమా ఇది. అంధుడైతేనేమి ఏ మాత్రం తగ్గడట ఎంటర్టైన్మెంట్లో మాస్ రాజా. ట్రైలర్ చూస్తుంటేనే ఈ విషయం అర్ధమైపోతోంది. కళ్లు లేకపోతేనేం అభిమానులకు రవితేజ నుండి కోరుకునే అన్ని అంశాలు 100 పర్సెంట్ దక్కుతాయంటున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. దిల్ రాజు నిర్మాత. దిల్ రాజు సినిమా అంటే ఆషామాషీగా ఉండనే ఉండదు. కథలో కంటెన్ట్ కరెక్ట్‌గా ఉంటే కానీ, ఆ ప్రాజెక్ట్‌ని దిల్ రాజు టేకప్ చేయడు. ఇక హీరోయిన్గా ముద్దుగుమ్మ మెహరీన్ నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే లక్కీబ్యూటీస్ ఖాతాలోకి చేరిపోయింది. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాల్లో రెండు సినిమాలు సూపర్ హిట్సే. సో ఈ సినిమాకి అన్నీ కలిసొచ్చే అంశాలే కనిపిస్తున్నాయి. దీపావళికి జనానికి నవ్వుల పటాసులు పంచేందుకు సిద్ధమైపోయాడు రవితేజ. ఈ నెల 18న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా పబ్లిసిటీ షురూ చేసేసింది చిత్ర యూనిట్. బీభత్సంగా పబ్లిసిటీ జరుగుతోంది. ప్రమోషన్స్ జోరందుకోవడంతో సినిమాకి హిట్ కళ వచ్చేసింది.