ఈ ఏడాది రవితేజ ఆల్రెడీ ఓ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజా ది గ్రేట్' సినిమా అది. మెహరీన్ కథానాయికగా నటించింది. రవితేజ అంధుడిగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చినా, రవితేజ హిట్ పట్టుకెళ్లిపోయాడు ఈ సినిమాతో.
ఇక మరో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ సినిమా 'టచ్ చేసి చూడు'. రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. కాగా తాజాగా రవితేజ మరో సినిమా కన్ఫామ్ అయ్యింది. కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరక్కెనుంది. రామ్ తాళ్లూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ డిశంబర్‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
కాగా రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' చిత్రం సంక్రాంతి సీజన్లో విడుదల చేస్తే బావుంటుందని చిత్ర యూనిట్ యోచిస్తోందట. సంక్రాంతి అంటే సరదాల పండగ, ఆ సరదా పండక్కి సరదాల రవితేజ మూవీని విడుదల చేస్తే ప్రేక్షకుల కళ్లల్లో మరిన్ని సంతోషాలు చూడొచ్చంటున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రంతో పాటు, బాలయ్య సినిమా 'జై సింహా' కూడా ఉంది. ఈ రెండు పెద్ద సినిమాల నడుమ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న 'రాజుగాడు' చిత్రం ఉంది. వీటితో పాటు డబ్బింగ్ చిత్రం సూర్య 'గ్యాంగ్' కూడా సంక్రాంతికే వస్తోంది.
వీటన్నింటితో పాటు, రవితేజ 'టచ్ చేసి చూడు' చిత్రాన్ని సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు చిత్ర వర్గాల నుండి అందుతోన్న తాజా సమాచారమ్. చూడాలి మరి రవితేజ సంక్రాంతి బరిలో నిలుస్తాడో లేదో!