రవితేజ - గోపీచంద్ మలినేని కాంబోలో పట్టాలెక్కాల్సిన సినిమా బడ్జెట్ పెరిగిపోవడం వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రవితేజ - హరీష్ శంకర్ సినిమాకీ ఈ సమస్య పట్టుకొంది. వీరిద్దరి కాంబినేషన్‌లో 'మిస్టర్ బచ్చన్' అనే సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఆఘమేఘాల మీద జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకీ బడ్జెట్ 'కోత' తప్పడం లేదని టాక్. ముందు అనుకొన్న అంకెలకూ, ఇప్పుడు తేలుతున్న లెక్కలకూ పొంతన లేదని తెలుస్తోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీగా ఖర్చు పెట్టే నిర్మాణ సంస్థే. రవితేజతో మంచి రాపో కూడా ఉంది. అయితే.. ఈ సంస్థకు ఈమధ్య వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కాబట్టి.. కాస్ట్ కంట్రోల్ చేయక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో హరీశ్ సినిమాకీ.. బడ్జెట్ పరిమితులు విధించినట్టు టాక్.
ఈ సినిమా కోసం రవితేజ రూ.30 కోట్ల పారితోషికం అందుకొంటున్నాడు. రవితేజ 'ధమాకా' చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూ.25 కోట్లు పారితోషికంగా కట్టబెట్టింది. రాబోయే 'ఈగల్' చిత్రాన్నీ ఈ సంస్థే నిర్మిస్తోంది. దీనికి కూడా అక్షరాలా రూ.25 కోట్లు అందుకొన్నాడు రవితేజ. మూడో సినిమాకు మాత్రం రూ.5 కోట్ల పారితోషికం పెరిగింది. ఈ రూ.5 కోట్లూ తగ్గించుకొంటే - కాస్త వెసులుబాటుగా ఉంటుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భావిస్తురన్నారు. హరీష్ కూడా ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించవచ్చు? అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్టు టాక్. హరీష్ తెలివైన టెక్నీషయనే. తక్కువ ఖర్చుతో మంచి అవుట్ పుట్ ఇవ్వగలడు. అందుకే విశ్వ ప్రసాద్ కూడా హరీష్ పై నమ్మకం పెట్టుకొన్నట్టు తెలుస్తోంది.