టాలీవుడ్ లో మల్టీస్టారర్‌ల జోరు కొనసాగుతూనే ఉంది. అగ్ర కథానాయకుడు చిరంజీవి కూడా మల్టీస్టారర్లపై దృష్టి పెడుతున్నారు. `ఆచార్య` ఓ రకంగా మల్టీస్టారర్ సినిమానే. ఎందుకంటే ఇందులో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించారు. `లూసీఫర్` రీమేక్ గా వస్తున్న `గాడ్ ఫాదర్`లో చిరంజీవితో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడు. ఆ ఛాన్స్ సల్మాన్ ఖాన్ కి దక్కబోతోందన్నది టాలీవుడ్ టాక్. అందుకే `గాడ్ ఫాదర్`నీ మల్టీస్టారర్ జాబితాలో చేర్చొచ్చు. ఇప్పుడు బాబి సినిమా కూడా మల్టీస్టారర్ అయ్యే ఛాన్సుంది.
బాబి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఓ సినిమా రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మించనుంది. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్ ని కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం... రవితేజని ఎంచుకున్నారని తెలుస్తోంది. చిరంజీవి అంటే రవితేజకు చాలా ఇష్టం. తన అభిమానిగానే రవితేజ ఇండ్రస్ట్రీకి వచ్చారు. అన్నయ్యలో చిరు తమ్ముడిగా రవితేజ నటించారు. అయితే అప్పటికి రవితేజ హీరో కాదు. `శంకర్ దాదా జిందాబాద్`లో ఓ పాటలో నర్తించారు. పూర్తి స్థాయి చిత్రంలో కనిపించలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఓ హీరోకీ- అభిమానికీ మధ్య జరిగే కథ ఇది. మరి హీరోగా ఎవరు? అభిమానిగా ఎవరు నటిస్తారు? అనేది తెలియాల్సివుంది.