ఈ యేడాది రవితేజకు ఎదురే లేకుండా పోతోంది. క్రాక్ హిట్ తో రవితేజలో జోష్ వచ్చింది. సినిమా తరవాత సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు. క్రాక్ తరవాత.. రవితేజ నుంచి రాబోతున్న సినిమా ఖిలాడి. ఈ యేడాదే ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ... 2022కి వెళ్లిపోయింది. 2022 ఫిబ్రవరి 11న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అంటే దాదాపు 3 నెలల సమయం ఉందన్న మాట. అయితే.. అప్పటికీ ఈ ఖిలాడికి గట్టి పోటీ ఉండబోతోంది. ఎందుకంటే 2022 ఫిబ్రవరి 4న ఆచార్య విడుదల కాబోతోంది.
చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. 2022లో విడుదల కాబోతున్న భారీ సినిమాల్లో ఇదొకటి. ఓ వారం గ్యాప్‌లోనే ఖిలాడిని విడుదల చేయాలనుకోవడం నిజంగా సాహసమే. ఎందుకంటే చిరు సినిమా క్లిక్ అయితే.. కనీసం 2 వారాల పాటు ఆ ప్రభంజనం ఉంటుంది. వారం రోజుల వ్యవధిలోనే.. ఖిలాడి రావడం.. రవితేజకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. కాకపోతే.. రవితేజ కాన్ఫిడెన్స్ వేరు. ఒకేరోజున రెండు పెద్ద సినిమాలు వచ్చినా, జనం చూస్తారన్న నమ్మకంతోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నారేమో నిర్మాతలు. మరి చిరు, రవితేజల మధ్య వారం రోజులు సరిపోతాయా, లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి.