మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకుడు. లాక్ డౌన్ కి ముందే ఈ సినిమా ఖాయమైపోయింది. అయితే లాక్ డౌన్, ఆ తరవాతి పరిస్థితుల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్ని నిర్మాత కోనేరు సత్యనారాయణ ఖండించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే ఈ సినిమాని లాంచ్ చేస్తామని నిర్మాత తెలిపారు.
సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు. ఒక చక్కని స్క్రిప్టుతో రవితేజ, రమేష్ వర్మ కలయికలో సినిమా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భారీ బడ్జెట్తో, ఉన్నత స్థాయి సాంకేతిక విలువలతో నిర్మాణం కానున్న ఈ సినిమాకు పేరుపొందిన టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.