చిత్రసీమలో సెంటిమెంట్లు బలంగా ఉంటాయి. ఫ్లాప్ దర్శకుడ్ని, హీరోయిన్‌ని పక్కన చేర్చుకోవడానికి హీరోలు అస్సలు ఇష్టపడరు. ఒకసారి ఫ్లాప్ ఇస్తే.. వాళ్లకు ఆమడదూరం ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఇవేం పట్టించుకోరు. రవితేజ కూడా అలాంటి హీరోనే. ఫ్లాపుల్ని ఏమాత్రం లెక్క చేయని హీరో తను. అందుకే ఈ సెంటిమెంట్లని చాలాసార్లు క్రాస్ చేశాడు. ఇప్పుడు కూడా అంతే.
రవితేజ - రమేష్‌వర్మ కాంబినేషన్ లో ఇప్పటి వరకూ రెండు సినిమాలొచ్చాయి. వీర...బిలో యావరేజ్‌గా నిలిచింది. మొన్నొచ్చిన ఖిలాడీ అయితే డిజాస్టర్ అయ్యింది. ఇలా రెండు ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడ్ని మరో హీరో అయితే పక్కకు కూడా చేరనివ్వడు.
అయితే రవితేజ.. రమేష్ వర్మకి మరోసారి అవకాశం ఇచ్చాడు. అయితే ఈసారి.. తన కోసం కాదు. తన తమ్ముడి కొడుకు కోసం. రవితేజ సోదరుడు కుమారుడు మాధవ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ ప్రాజెక్టు బాధ్యతల్ని పూర్తిగా రమేష్ వర్మకి అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకుడు కాదు. కేవలం ప్రాజెక్టుని హ్యాండిల్ చేస్తాడంతే. మాధవ్ కోసం రమేష్ వర్మ దగ్గరుండి ఓ కథ సిద్ధం చేయించాడని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. రవితేజకు రెండు ఫ్లాపులు ఇచ్చిన రమేష్ వర్మ.. రవితేజ తమ్ముడు కొడుక్కి ఎలాంటి సినిమా ఇస్తాడన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది. రవితేజ జడ్జిమెంట్ గురి తప్పకుండా ఉండాలంటే... రమేష్ వర్మ హిట్టు కొట్టి తీరాల్సిందే.