ఈ యేడాది బాక్సాఫీసు దగ్గర `క్రాక్` పుట్టించాడు రవితేజ. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో.. రవితేజ జోరు మరింత పెరిగిపోయింది. వరుసగా సినిమాల మీద సినిమాలు ప్రకటించేస్తున్నారు. తాజాగా సుధీర్ వర్మ చెప్పిన కథని రవితేజ ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు.. ఈ సినిమా టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి `రావణాసుర` అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ వదిలారు. రావణాసుర.. టైటిల్ కి తగ్గట్టుగానే రవితేజ పది తలలతో దర్శనమిచ్చాడు. హీరో పాత్రలో నెగిటీవ్ లక్షణాలు ఉండడం ఈమధ్య తరచూ కనిపిస్తూనేఉంది.
ఈ సినిమాలోనూ అంతే. అందుకే ఈ టైటిల్ పెట్టారు. అభిషేక్ నామాతో పాటు రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా కథ అందించారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి. రవితేజ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం `ఖిలాడి` విడుదలకు సిద్ధమైంది. మరోవైపు.. `రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా` సెట్స్‌పై ఉన్నాయి. ఇటీవలే `టైగర్ నాగేశ్వరరావు`కి సంబంధించిన ప్రీ లుక్ కూడా విడుదల చేశారు.