బెంగాల్ టైగర్ తరవాత మరో సినిమా చేయడానికి చాలా కాలం వేచి చూసిన మాస్‌రాజా రవితేజ... 'టచ్ చేసి చూడు'తో మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. ఈ సినిమా ఇటీవలే క్లాప్ కొట్టుకొంది. ఇప్పుడు మరో ప్రాజెక్టుని పట్టాలెక్కించేశాడు. అదే.. 'రాజా ది గ్రేట్'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని దిల్‌రాజు ఆఫీసులో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. తొలి షాట్‌కి కల్యాణ్ రామ్ క్లాప్ నిచ్చారు. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మార్చిలో షూటింగ్‌కి వెళ్లనుంది. రవితేజ ఈ సినిమాలో ఓ అంధుడిగా కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. అటు టచ్ చేసి చూడు, ఇటు రాజా ది గ్రేట్ చిత్రాలు రెండూ సమాంతరంగా చిత్రీకరణ జరుపుకోనున్నాయి. ఈ రెండుచిత్రాలూ ఇదే యేడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.