ఈ మధ్య అన్నీ భాషలలో రీమేక్ సినిమాల జోరు పెరిగింది. ప్రస్తుతం తెలుగులోనే అరడజను రీమేక్ సినిమాలు సెట్లపైన, ప్లానింగ్ దశలోనూ ఉన్నాయి. ఇంకా నాలుగైదు తెలుగు సినిమాలను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక పాత తెలుగు క్లాసిక్ సినిమా తెలుగులోనే మరోసారి రీమేక్ చేస్తున్నారని వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిరంజీవి కెరీర్లో ఒక మరపురాని చిత్రంగా నిలిచిన 'చంటబ్బాయ్' సినిమాను మాస్ మహారాజా రవితేజ హీరోగా రీమేక్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత 'నేను లోకల్' ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నటించేందుకు రవితేజ పచ్చ జెండా ఊపినట్టుగా సమాచారం అందుతోంది. ఇది 'చంటబ్బాయ్' రీమేక్ గా తెరకెక్కుతోందని అంటున్నారు. 'చంటబ్బాయ్' స్క్రిప్టును ఇప్పటి తరం ప్రేక్షకులకు నచ్చేలా మార్చి రవితేజ తో తెరకెక్కించేందుకు త్రినాధ రావు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జోరుగా సాగుతోందని, దాంతోపాటు నటీనటులు టెక్నీషియన్ల ఎంపిక కూడా కొనసాగుతోందని సమాచారం.
డిటెక్టివ్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన 'చంటబ్బాయ్' అప్పట్లో చిరంజీవికి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పటికీ డిటెక్టివ్ కామెడీ అనగానే తెలుగులో గుర్తుకొచ్చే మొట్టమొదటి సినిమా 'చంటబ్బాయ్'. ఈ సినిమాను రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఎలా మలుస్తారో వేచి చూడాలి. రవి తేజ కామెడీ టైమింగ్ గురించి, తెరపై చేసే అల్లరి గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఇలాంటి పాత్ర కనుక రవితేజ చేస్తే తప్పనిసరిగా ప్రేక్షకులకు నవ్వులు ఖాయమే అనుకోవాలి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.