సినిమాకి ప్రాణం కధ అయితే.. ఆ ప్రాణంకి అందమైన రూపం ఇచ్చేది మాత్రం స్క్రీన్ ప్లేనే. తీసుకున్న పాయింట్ చిన్నదే. కానీ దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లేలోనే వుంటుంది సినిమా విజయం. ముఖ్యంగా చిన్న, మీడియం సినిమాలు స్క్రీన్ ప్లేని నమ్ముకునే బ్రతుకుతాయి.
అలా ఈ ఏడాది అబ్బురపరిచిన సినిమా బ్రోచేవారెవరురా. 'చలనమే చిత్రము - చిత్రమే చలనము' అనే ట్యాగ్‌లైన్ ఇచ్చిన ఈ సినిమా దానికి తగ్గట్టే భలే విచిత్రం అనిపించింది.
సెల్ఫ్ కిడ్నాప్ ప్లాన్ చేసుకోవడం, సినిమా కథ నెరేట్ చేస్తుండగా ఆ పాత్రలు జీవం పోసుకోవడం లాంటి పాయింట్స్ ఇంతకుముందు వచ్చాయి. బ్రోచేవారెవరురా కూడా అలాంటి కధే. కానీ కానీ వివేక్ ఆత్రేయ అదే పాయింట్ ని సరికొత్తగా ప్రజంట్ చేశాడు. సినిమా కథనం మొత్తం ఈ రెండు లైన్లలోనే వుంటుంది. ఆ రెండు లైన్స్ ని కలిపిన విధానం భలే ఆసక్తికరంగా సాగింది. క్రైమ్ కామెడీలని ఇష్టపడే వాళ్లనే కాకుండా, వైవిధ్యభరిత వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకీ నచ్చింది.